17-08-2025 12:34:29 AM
-20న శాంతియుతంగా అన్ని కలెక్టర్ కార్యాలయాల ముట్టడి
-బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, ఎంపీ ఆర్. కృష్ణయ్య
ముషీరాబాద్, ఆగస్టు 16 (విజయక్రాంతి): పెండింగ్‌లో ఉన్న విద్యార్థుల రూ. 8 వేల కోట్ల ఫీజు రియంబర్స్ మెంట్ బకాయిలు చెల్లించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశించినప్పటికీ అధికారులు నిర్లక్ష్యం వహిస్తూ ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చేలా ప్రవర్తిస్తున్నారని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, ఎంపీ ఆర్. కృష్ణయ్య విమర్శించారు. విద్యార్థి ఉద్యమాలను తక్కువగా చూడొద్దన్నారు. బకాయిల విడుదల కోసం ఈ నెల 20న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జూనియర్, డిగ్రీ కళాశాలలను బహిష్కరించి, విద్యార్థులతో కలిసి కలెక్టరేట్, ఆర్డీవో, ఎమ్మార్వో కార్యాలయాల వద్ద శాంతియుతంగా నిరసన తెలిపి, అధికారులకు వినతి పత్రాలు అందజే స్తామని తెలిపారు.
ఈ మేరకు శనివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ బిసి విద్యార్థి సంఘం అధ్యక్షుడు వేముల రామకృష్ణ అధ్యక్షతన ఛలో కలెక్టరేట్ కు సంబందించిన వాల్ పోస్టర్‌ను ఎంపీ కృష్ణయ్య ఆవిష్కరించి మాట్లాడారు. బడ్జెట్ లో విద్యకు కేటాయించిన సొమ్మును డబ్బులను మంత్రులు మిం గుతున్నారని ఆరోపించారు. కాంట్రాక్టర్లకు వేల కోట్లు బిల్లులను రిలీజ్ చేస్తూ, 14 లక్షల మంది విద్యార్థుల బకాయిల విడుదలలో మాత్రం ప్రభుత్వం తీవ్ర జాప్యం వహిస్తుందని అన్నారు.
ఈ బకాయిల విషయంలో ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క ను అనేక సార్లు కలసి విజ్ఞప్తి చేసినప్పటికీ పట్టించుకోవడం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు గడుస్తున్నా, ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు రూ.20 కూడా విడుదల చేయలేదని ఎద్దేవా చేశారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని విద్యార్థులకు, కాలేజీ యాజమాన్యాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఖర్చు చేసిన నాలుగు లక్షల కోట్లకు లెక్క చెప్పాలని డిమాండ్ చేశారు.
అవినీతి ఐఏఎస్ అధికారులపై త్వరలో ప్రధాని మోడీని కలిసి వివరిస్తానని తెలిపారు. అధికారులు అక్రమంగా తిన్న సొమ్మును కక్కిస్తామన్నారు. ఫీజుల స్కీములు ఎత్తివేయడానికి ‘ట్రస్ట్ బ్యాంకు’ ఏర్పాటు చేసి దాని ద్వారా ఫీజులు చెల్లిస్తామని కొత్త నాటకానికి తెర లేపారని ఈ ప్రతిపాదన ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని అన్నారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ నీల వెంకటేష్ ముదిరాజ్, వేముల రామకృష్ణ, నంద గోపాల్, సుధాకర్, మోడీ రాందేవ్, కార్తీక్ పటేల్, వంశీ కృష్ణ, గౌడ్, భరత్ గౌడ్, అభిరాం గౌడ్, చిక్కుడు బాలయ్య, కరుణ తదితరులు పాల్గొన్నారు.