calender_icon.png 27 January, 2026 | 2:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం

12-08-2024 12:00:00 AM

నీటిపాదరులశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి 

  1. దున్నపోతుల గండి ఎత్తిపోతల పనుల పరిశీలన 
  2. సాగునీటి ప్రాజెక్టులపై సమీక్ష 
  3. మిర్యాలగూడలో 5 ఎత్తిపోతలకు రూ.490 కోట్లు కేటాయింపు 

నల్లగొండ, ఆగస్టు 11 (విజయక్రాంతి): నల్లగొండ జిల్లాలో పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నదని నీటిపారుదల శాఖ మంత్రి నల్లమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. అడవిదేవులపల్లి మండలం చిట్యాల గ్రామ పరిధిలోని దున్నపోతుల గండి ఎత్తిపోతల పథకాన్ని ఆదివారం ఆయన సందర్శించి, పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. రూ.219.19 కోట్లతో చేపట్టిన దున్నపోతుల గండి ఎత్తిపోతల పూర్తయితే 12,239 ఎకరాలు సాగులోకి వస్తుందని తెలిపారు.

ఉల్సాయపాలెం, మొల్కలపల్లి, బాల్నేపల్లి, చాంప్లతండా, కొత్త నందికొండ, అడవిదేవులపల్లి చాట్యాల గ్రామాలు సస్యశ్యామలం అవుతాయని పేర్కొన్నారు. దామరచర్ల మండలం బొత్తలపాలెం, వీర్లపాలెం2,  తోపుచర్ల, కేశవాపురం ఎత్తిపోతల పథకాలు పూర్తయితే మరో 18,500 ఎకరాలకుపైగా సాగునీరు అందుతుందని వెల్లడించారు. పనుల పూర్తికి రూ.373.67 కోట్లకు పాలనా అనుమతులు ఇచ్చినట్లు మంత్రి గుర్తు చేశారు.

ఎస్సెల్బీసీ, డిండి ఎత్తిపోతలపై సమీక్ష

ఎస్సెల్బీసీ, డిండి ఎత్తిపోతలతోపాటు దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాల్లోని సాగు ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డిండి మండల కేంద్రంలో ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎస్సెల్బీసీ సొరంగ మార్గాన్ని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పనుల పూర్తికి అంచనాలు సవరించి రూ. 460 కోట్లు కేటాయించాలని క్యాబినేట్‌కు విన్నవించినట్లు గుర్తు చేశారు.

దేవరకొండలోని అంబాభవాని, కంబాలపల్లి ఎత్తిపోతల పథకాలను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. డిండి ఎత్తిపోథల పథకంలో భాగంగా చేపట్టిన కిష్టరాంపల్లి, చర్లగూడెం రిజర్వాయర్లలో భూములు కోల్పోయిన నిర్వాసితులకు న్యాయం చేయాలని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి మంత్రిని కోరారు. ఉదయ సముద్రం ఆయకట్టును 20 వేల ఎకరాలకు పెంచాలని, మూసీ, పునాదిగాని, ధర్మారెడ్డి, పిలాయిపల్లి కాల్వల పరిధిలోని ఆయకట్టు స్థిరీకరణపై దృష్టిపెట్టాలని విన్నవించారు.

మంత్రి వెంట మిర్యాలగూడ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, నీటిపారుదల శాఖ కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, ఇంజినీరింగ్ ఇన్ చీఫ్ అనిల్, కలెక్టర్ నారాయణరెడ్డి ఉన్నారు. 

మంత్రిని అడ్డుకున్న చిట్యాల గ్రామస్థులు

దున్నపోతుల గండి లిప్టు పనుల పరిశీలనకు వచ్చిన మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి నిరసన సెగ తగిలింది. చిట్యాల వద్ద గ్రామస్థులు మంత్రిని అడ్డుకున్నారు. టేల్‌పాండ్ ప్రాజెక్టులో భూములు, ఇండ్లు కోల్పో యిన తమకు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ కింద పరిహారం ఇవ్వకుండా అన్యా యం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. టేల్‌పాండ్ నీటిమట్టం పెరిగినప్పుడు ఇళ్లలోకి పాములు, తేళ్లు వస్తున్నాయని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.