08-09-2025 12:42:46 AM
రామచంద్రపురం, సెప్టెంబర్ ౮ : ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన పెన్షన్ల పెంపు హామీని నెరవేర్చాలని, దివ్యాంగులు, వృద్ధులు, వితంతువులకు చేయూత ఇవ్వాలని ఎమ్మార్పీస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా ఆర్సిపురం మండలం కొల్లూరు గ్రామంలో ఆదివారం నిర్వహించిన పెన్షనర్ల మహాగర్జన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఈ సభకు రాష్ట్ర వ్యాప్తంగా అధిక సంఖ్యలో పెన్షనర్లు తరలివచ్చారు.
ఈ సందర్భంగా మంద కృష్ణ మాదిగ మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 21 నెలలు అయినా.. ఎన్నికలకు ముందు ఇచ్చిన పెన్షన్ల పెంపు హామీని ఇప్పటి వరకు సీఎం రేవంత్‌రెడ్డి అమలు చేయడం లేదని మండిపడ్డారు. ఇప్పటికే 45 లక్షల మంది పెన్షనర్లు ఉన్నారని, మరో 10 లక్షల మంది దరఖాస్తులు చేసుకుని ఎదురు చూస్తున్నారని చెప్పారు.
కాంగ్రెస్ తన మ్యానిఫెస్టోలో దివ్యాంగులకు రూ.6,000 పెన్షన్, వృద్ధులు, వితంతువులు, నిరాశ్రయులైన మహిళలు, ఒంటరి మహిళలకు రూ.4,000 పెన్షన్ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. డిసెంబర్ 9, 2023 నుంచి ఆ డబ్బును నేరుగా పెన్షనర్ల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారని గుర్తుచేశారు. కానీ 21 నెలలు గడిచినా కూడా ఏమీ చేయలేదని మండిప్డారు. ప్రతిపక్ష పార్టీలు, నాయకులు కూడా ఈ అంశాన్ని అసెంబ్లీలోగానీ, బయటగానీ లేవనెత్తకపోవడం బాధాకరమన్నారు.
ఈ విషయంలో మాజీ సీఎం కేసీఆర్, సీఎం రేవంత్‌రెడ్డి ఇద్దరూ విఫలమయ్యారని దుయ్యబట్టారు. 55 లక్షల మంది పెన్షనర్లు మోసపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను జూలై 15 నుంచి పెన్షన్ల పెంపు విషయమై అన్ని జిల్లాలో సభలు పెడుతూ.. ప్రభుత్వానికి విన్నపాలు చేస్తున్నా విస్మరిస్తూనే వస్తున్నదని పేర్కొన్నారు. ఇప్పటికైనా పెన్షన్లు అమలు చేయకుంటే తెలంగాణలోని 33 జిల్లాల్లో ధర్నా కార్యక్రమాలు ఉధృతంగా నిర్వహిస్తామని హెచ్చరించారు. హైదరాబాద్ రహదారిని దిగ్బంధిస్తా మని హెచ్చరించారు.