9 July, 2026 | 6:01 PM

యూపీలో ఘోరం 116 మంది మృతి మృత్యుఘోష

03-07-2024 01:40 AM

హత్రాస్ సత్సంగ్‌లో తొక్కిసలాట

మృతుల్లో మహిళలు, పిల్లలే అధికం

ఉత్తరప్రదేశ్‌లో ఘోరం జరిగింది. హత్రాస్ జిల్లాలో నిర్వహించిన ఓ మతపరమైన కార్యక్రమంలో తొక్కిసలాట చోటుచేసుకోవటంతో 116 మందికిపైగా మరణించారు. వందలమంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నదని అధికార వర్గాలు తెలిపాయి. హత్రాస్ జిల్లాలోని సికంద్రరావ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉన్న రతిభాన్పూర్ గ్రామంలో మానవ్ మంగళ్ మిలన్ సద్భావన సమాగమ్ కమిటీ మంగళవారం శివారాధన సత్సంగ్ కార్యక్రమం నిర్వహించింది.

ఈ కార్యక్రమ ముగింపు సమయంలో భక్తులంతా ఒక్కసారే తోసుకురావటంతో తొక్కిసలాట జరిగిందని హత్రాస్ జిల్లా కలెక్టర్ ఆశిష్ కుమార్ తెలిపారు. క్షతగాత్రులు అధికంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉన్నది. మృతుల్లో మహిళలు, పిల్లలే అధికంగా ఉన్నారు. ఈ దుర్ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్రమోదీ తీవ్ర దిగ్భాంత్రి వ్యక్తంచేశారు. 

  1. మత గురువుకోసం దారి మూయటంవల్లే దుర్ఘటన
  2. విచారణకు ఆదేశించిన యూపీ ప్రభుత్వం
  3. రాష్ట్రపతి, ప్రధాని తీవ్ర దిగ్భ్రాంతి
  4. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం

లక్నో, జూలై 2: ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్, ఇటాహ్ జిల్లాల సరిహద్దుల్లో ఉన్న రతిభాన్పూర్‌లోని ఆశ్రమంలో నారాయణ్ సకార్ హరి అలియాస్ భోలే బాబా, ఆయన సతీమణితో కలిసి మంగళవారం సత్సంగ్ కార్యక్రమం నిర్వహించారు. హత్రాస్, ఇటాహ్‌తోపాటు చుట్టుపక్కల జిల్లాల్లో భోలే బాబాకు లక్షల సంఖ్యలో భక్తులు ఉన్నారు. సకార్ విశ్వహరి భోలే బాబా పేరుతో గత 27 ఏండ్లుగా ఆయన మతపరమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

మంగళవారం నాటి కార్యక్రమానికి దాదాపు 50 వేల మంది భక్తులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వం నుంచి ముందుగానే అనుమతి తీసుకొన్నప్పటికీ.. ఆశ్రమంలో భద్రత, నిర్వహణ ఏర్పాట్లను ఆశ్రమం అధికారులే చూసుకొన్నట్టు పోలీసులు తెలిపారు. భారీ సంఖ్యలో హాజరైన భక్తులు కార్యక్రమం ముగింపు సమయంలో ఒక్కసారిగా బయటకు వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో తొక్కసలాట జరిగింది. 

ఎటు చూసినా శవాలే

రతిభాన్పూర్ ఆశ్రమంలో తొక్కిసలాట తర్వాత భీతావహ వాతావరణం కనిపించింది. ఎటు చూసినా మతృదేహాలే దర్శన మిచ్చాయి. మహిళలు, పిల్లల మృతదేహాలు చెల్లాచెదరుగా పడి ఉండటం కలచివేసింది. కాళ్లు, చేతులు విరిగిన క్షతగాత్రులు నేలపై పడి నిస్సహాయంగా రోదించారు. మృతుల కుటుం బసభ్యుల రోదనలతో ఆశ్రమంలో తీవ్ర విషాదఛాయలు అలముకొన్నాయి. మృతదేహాలతోపాలు గాయపడ్డవారిని ఇటాహ్ జిల్లాలని దవాఖానలకు తరలించారు. శవాలను భద్రపరిచేందుకు కూడా స్థలం లేకపోవటంతో నేలపైనే ఎక్కడపడితే అక్కడ పడేశారు.  

ఎవరీ భోలే బాబా? 

భోలే బాబా అసలు పేరు నారాయణ్ సాకర్ హరి. ఆయన స్వగ్రామం ఇటాహ్ జిల్లాలోని బహదూర్ నాగరి. ఆయన మొదట తన తండ్రితో కలిసి వ్యవసాయం చేసేవారు. ఆ తర్వాత పోలీస్ విభాగంలో చేరినట్టు సమాచారం. 17 ఏండ్లపాటు స్థానిక నిఘా విభాగంలో పనిచేశాడని నవ్‌భారత్ టైమ్స్ పేర్కొన్నది. పోలీస్ ఉద్యోగం నుంచి రిటైర్ అయిన తర్వాత ఆయన మత బోధకుడిగా అవతారమెత్తాడు. సాధారణంగా హిందూ మతబోధకులు కాషాయం ధరిస్తారు. ఒంటరిగానే బోధనలు చేస్తారు. కానీ, ఈయన అందుకు భిన్నం. ఎప్పుడూ రాజకీయ నాయకుల మాదిరిగా తెల్ల చొక్కా, ప్యాంటు ధరిస్తారు. చాలాసార్లు బోధనలు చేసే సమయంలో తెల్లని సూటు, టై ధరిస్తారు. వేదికపై తన సతీమణితో కలిసే సత్సంగ్‌లు నిర్వహిస్తారు.

రతిభాన్పూర్ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్రమోదీ, కాంగ్రెస్ నేతలు రాహల్‌గాంధీ, మల్లికార్జున ఖర్గే, యూపీ సీఎం యోగి ఆధిత్యనాథ్, ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ తీవ్ర సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. ఈ దుర్ఘటపై ప్రధాని మోదీ లోక్‌సభలో ఓ ప్రకటన చేశారు. మృతుల కుటుంబాలకు యూపీ ప్రభుత్వం రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది.  

బాబా కారు కోసం ఆపటం వల్లనే

కార్యక్రమాన్ని ఆసాంతం సవ్యంగానే నిర్వహించినప్పటికీ.. చివరలో ఆశ్రమ అధికారులు చేసిన పొరపాటుతో ఘోరం జరిగిపోయింది. కార్యక్రమం ముగియగానే  చిన్న గేటు నుంచి ప్రజలంతా ఒక్కసారిగా బయటకు వెళ్లిపోయేందుకు ప్రయత్నించారని, అదే సమయంలో భోలే బాబా కారు వెళ్లిపోయేవరకు ప్రజలను ఆయన సిబ్బంది ఆపివేశారని కార్యక్రమానికి హాజరైన ఓ మహిళ తెలిపారు. కారు వెళ్లిపోయేవరకు ప్రజలను ఆపటంతో తొక్కిసలాట జరిగిందని  వాపోయింది.