24-10-2025 12:00:00 AM
భద్రాచలం, అక్టోబర్ 23, (విజయక్రాంతి): గత సంవత్సర కాలంగా ఇసుక రవాణాతో భద్రాచలం వెంకటాపురం మధ్య జాతీయ రహదారి పూర్తిగా ధ్వంసం అయిపోయి ఏజెన్సీ గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయి జనజీవనం స్తంభించిపోతున్న రాష్ట్ర ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా ఉండటం లేదని ఎక్కడికక్కడే ప్రజల స్వచ్ఛందంగా పోరాటంలోకి వచ్చిన ప్రభుత్వ పెద్దలు స్పందించకపోవడం దారుణమని సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు.
గురువారం భద్రాచలం వెంకటాపురం జాతీయ రహదారిని పునర్మించాలని రహదారులను ధ్వంసం చేస్తున్న ఇసుక లారీలను నియంత్రించాలని కోరుతూ రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సిపిఐ ఎం పార్టీ తరఫున జూలకంటి రంగారెడ్డి, మచ్చ వెంకటేశ్వర్లు సూడి కృష్ణారెడ్డి ల బృందం గురువారం హైదరాబాదులో వినతి పత్రాన్ని అందించారు.
ఈ సందర్భంగా జూలకంటి మాట్లాడుతూ దక్షిణ అయోధ్యగా విరజిల్లుతున్న భద్రాచలం నుండి యాత్రికులు పర్ణశాలకు కూడా వెళ్లే పరిస్థితి లేకుండా రోడ్లు తయారయ్యాయని అన్నారు. వెంటనే ఇసుక లారీలు నియంత్రించి రోడ్డులను పునర్మించాలని కోరారు.
ప్రభుత్వం స్పందించకపోతే ప్రజా తిరుగుబాటు తప్పదు : సీపీఐఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు
ఇసుకసురుల అత్యాశకు ఏజెన్సీ రోడ్డు లన్ని పూర్తిగా ధ్వంసం అయిపోయాయని గత ఆరు నెలలుగా సిపిఐ ఎం తో పాటు ఇతర రాజకీయ పక్షాలు స్వచ్ఛంద సంస్థలు ఎన్ని పోరాటాలు చేస్తున్న స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించడం లేదని ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు కళ్ళు తెరిచి రోడ్డు నిర్మాణం పట్టకపోతే ప్రజా తిరుగుబాటు తప్పదని స్పష్టం చేశారు.
గత ఆరు నెలల నుండి పరిస్థితి మరింత దారుణంగా తయారైందని విలీన గ్రామాలైన కన్నాయిగూడెం ఎట్టపాక వద్ద పూర్తిగా రోడ్డు ద్వంసం అయిపోయిందని తూరుబాక తో పాటు చర్ల మండలంలో కూడా అనేకచోట్ల రాకపోకలు కొనసాగించే అవకాశంకూడా లేకుండా పరిస్థితి చేజారిపోయిందని అన్నారు.
గత వారం కన్నాయి గూడెం ఎటపాక గ్రామ ప్రజలు స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి లారీలను అడ్డుకోవ డమే కాకుండా 24 గంటల పాటు రోడ్డుపైనే బయటించారని గుర్తు చేశారు. దుమ్ముగూడెం మండలంలో సైతం అనేకసార్లు రైతులు ప్రజలు స్వచ్ఛందంగా రోడ్లమీదకు వచ్చి రాస్తారోకో నిర్వహించారని ఇంత జరుగుతున్న స్థానిక ప్రజాప్రతినిధులు ఏమి పట్టనంటే అహరిస్తున్నారని ఇదే కొనసాగితే ఏజెన్సీ వ్యాప్తంగా తిరుగుబాటు తప్పదని మచ్చ హెచ్చరించారు.
రోడ్ల నిర్మాణం కోసం సిపిఐఎం పాదయాత్ర తల పెడితే వేలాదిమంది ప్రజలు స్వచ్ఛందంగా తరలి వచ్చారంటే పరిస్థితి ఎంత దారుణంగా మారిందో అర్థం చేసుకోవాలని కోరారు. రహదారుల విద్వాంశంపై ఇటీవల వివిధ పత్రికలలో వచ్చిన కథనాలను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సిపిఐ ఎం బృందం చూపించి విషయ తీవ్రతను వివరించారు.
విషయం తమ దృష్టికి రాలేదు..! : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
భద్రాచలం నుండి వెంకటాపురం మండలాల మధ్య గల జాతీయ రహదారి ఈ స్థాయిలో ధ్వంసం అయిపోయిందన్న విషయం గానీ ప్రజల నుండి ఈ స్థాయిలో తిరుగుబాటు వస్తుందన్న విషయం గానీ మా దృష్టికి రాలేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. జనజీవనం స్తంభించిపోయే స్థాయిలో రోడ్డులో అయిపోతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తూ కూర్చొని ఉండదని వీలైనంత త్వరగా బడ్జెట్లో పెట్టి జాతీయ రహదారిని పునర్ నిర్మిస్తామని సిపిఐఎం బృందానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టమైన హామీ ఇచ్చారు.
అంతేకాకుండా రోడ్లను ఈ స్థాయిలో ధ్వంసం చేస్తున్న ఇసుక లారీల నియంత్రణ కూడా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇప్పటికైనా ఈ విషయాన్ని సిపిఐఎం బృందం ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావటం అభినందనీయమని అన్నారు. వినతి పత్రంపై సానుకూలంగా స్పందించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సిపిఐఎం బృందం అభినందనలు తెలియజేస్తూ వీలైనంత త్వరగా రోడ్ల పునర్మాణానికి చర్యలు చేపట్టాలని మరోసారి విన్నపించారు.