ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
హైదరాబాద్, సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, మే 25 (విజయక్రాంతి): హైదరాబాద్‌లో భూముల ధరలు ఐదింతలు పెరిగాయి. పెరిగిన భూముల, నిర్మాణ సామగ్రి ధరలకు అనుగుణంగా నిర్మాణ సంస్థలు కూడా ప్లాట్ల ధరలను భారీగా పెంచాయి. బయ్యర్లను ఆకట్టుకునేలా కొందరు బిల్డర్లు ఆకర్షణీయ ప్రకటనలతో ప్లాట్లను సేల్ చేస్తున్నారు. అయితే కొన్ని సందర్భాలలో బిల్డర్లు అత్యాశకు పోయి బురిడీ కొట్టిస్తున్న సంఘటనలు ఉన్నాయి. ఈ క్రమంలోనే భూములు/ప్లాట్లపై కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేముందు ప్రజలు కొన్ని జాగ్రత్తలు పాటించాలని, ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
ఇందులో ప్రధానంగా బిల్డర్లు ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్మాణాలు చేశారా..? బిల్డర్ల, డెవలపర్స్ గత చరిత్ర, నాణ్యతా ప్రమాణాలు ఏ మేరకు పాటించారు? వంటి అంశాలపై ప్రధానంగా దృష్టి సారించాలని అధికారులు సూచిస్తున్నారు. అలాగే హెచ్‌ఎండీఏ పరిధిలోకి వచ్చే ప్రాంతాలలో ఏ లేఅవుట్ అయినా రెరా అనుమతి ఉండాలి. రెరా అనుమతి ఇచ్చిన వెంచర్లలో మొత్తం ప్లాట్లలో 15 శాతం మార్ట్‌గేజ్ చేస్తారు. రెరా అనుమతి పొందిన ఈ ప్లాట్‌లలో ఎర్ర మార్కు ఉన్న ప్లాట్లు మార్ట్‌గేజ్‌లో ఉన్నాయని గుర్తించాలి. ఎర్ర మార్కు ఉన్న ప్లాట్లను అమ్మకం, కొనుగోలు చేయడం చట్టవిరుద్దం. అయితే రెరా నిబంధనల ప్రకారం లేఅవుట్ చేసిన తర్వాతనే వాటిని మార్ట్‌గేజ్ నుంచి తొలగిస్తారు.
అలాగే ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్మించిన అపార్ట్‌మెంట్‌లోని ప్లాట్లకు ప్రభుత్వం నివాస దృవపత్రం జారీ చేస్తుంది. నివాస ధృవపత్రం వచ్చిన ప్లాట్లను మాత్రమే బయ్యర్లు కొనుగోలు చేయాలి. అపార్ట్‌మెంట్‌లలో మొదటి, రెండు అంతస్థుల్లోని ప్లాట్లు జీహెచ్‌ఎంసీ/మున్సిపాలిటీ మార్ట్‌గేజ్‌లో ఉంటా యి. అనుమతి పొందిన బిల్డింగ్ ప్లాన్‌లో మార్ట్‌గేజ్ ప్లాట్ల వివరాలు ఉంటాయి. నిబంధనలు పాటించిన భవనాలకు మాత్రమే నివాస ధృవపత్రాలు జారీ చేస్తారు. నివాస ధృవపత్రం లేకపోతే ఆ భవనం నిబంధనల ప్రకారం లేనట్లుగా ప్రజలు గర్తించాలి. అలాగే స్థలం వివాదంలో ఉన్నదా? అనే అంశాలపై బయ్యర్లు ప్రధానంగా దృష్టి పెట్టాలని అధికారులు సూచిస్తున్నారు.






