30-07-2025 10:34:54 PM
సబ్ సెంటర్ ను తనిఖీ చేసిన కేంద్ర ప్రభుత్వ అధికారులు..
గరిడేపల్లి (విజయక్రాంతి): వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వ అధికారి డాక్టర్ పర్వీన్(Central Government Officer Dr. Parveen) అన్నారు. మండల కేంద్రమైన గరిడేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని సబ్ సెంటర్ ను బుధవారం ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న జాతీయ కార్యక్రమాలకు సంబంధించిన రికార్డులను, రిపోర్టులను ఆమె పరిశీలించారు. జాతీయ వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమంతో పాటు మాత శిశు సంరక్షణ కార్యక్రమాలకు సంబంధించిన రికార్డులను ఆమె పరిశీలించారు. అనంతరం సబ్ సెంటర్ పరిధిలోని కొంతమంది ఇళ్లకు వెళ్లి బిపి, షుగర్ మందులు వాడుతున్న వారిని, టీబి మందులు వాడుతున్న వారిని కలిసి మందులు అందుతున్న తీరును, వైద్య ఆరోగ్య సిబ్బంది అందిస్తున్న సేవలపై ఆమె అడిగి తెలుసుకున్నారు. ప్రజలు ప్రస్తుత సీజన్లో వచ్చే వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ వి నరేష్, డిపిఓ ఉమా, ఎన్.సి.డి కోఆర్డినేటర్ సాంబశివరావు, హెల్త్ సూపర్వైజర్ అంజయ్య గౌడ్, ఏఎన్ఎం కవిత, బాలకృష్ణ, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.