calender_icon.png 19 September, 2025 | 9:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం

19-09-2025 01:04:20 AM

  1. దుర్గం చెరువు నీటిమట్టంపై చర్యలు తీసుకుంటాం
  2. శ్రీరాంనగర్‌లో యుద్ధప్రాతిపదిక నాలా నిర్మిస్తాం
  3. పూడికతీత పనులు చేపడతాం
  4. క్షేత్రస్థాయి పర్యటనలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి): భారీ వర్షాలతో నీట మునిగిన నగరంలోని పలు ప్రాంతాల్లో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ గురువారం క్షేత్రస్థాయిలో పర్యటించారు. తాత్కాలిక ఉపశ మన చర్యలు కాకుండా, ముంపు సమస్యకు శాశ్వత పరిష్కార మార్గాలు కనుగొనాలని అధికారులను ఆయన ఆదేశించారు. అమీర్‌పేట, మాదాపూర్, బాగ్‌లింగంపల్లి ప్రాంతా ల్లో పర్యటించిన ఆయన, స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

కాగా బాగ్ లింగంపల్లిలోని శ్రీరాంనగర్‌లో పరిస్థితిని చూసి హైడ్రా కమిషనర్ చలించిపోయారు. వందలాది ఇళ్లు నడుం లోతు నీటిలో చిక్కుకుపోయాయని, ఇళ్లలోకి వెళ్లే దారి కూడా లేదని స్థానికులు ఆయన ఎదు ట ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఉన్న నాలాను కొందరు కబ్జా చేసి మూసివేయడం వల్లే ఈ దుస్థితి దాపురించిందని, దానిని పునరుద్ధరిస్తే సమస్య తీరుతుందని వారు కమిషనర్‌కు విన్నవించారు.

తక్షణమే స్పందించిన రంగనాథ్, రెండు రోజుల్లో ఈ సమస్యకు పరిష్కారం చూపుతానన్నారు. శ్రీరాంనగర్ నుంచి హుస్సేన్‌సాగర్ వరద కాల్వలోకి కలిసేలా యుద్ధప్రాతిపదికన ప్రత్యేక నాలాను నిర్మించాలని అధికారులకు అల్టిమేటం జారీ చేశారు. అలాగే అనంతరం మాదాపూర్‌లోని అమర్ సొసైటీలో పర్యటించారు. దుర్గం చెరువు పూర్తిస్థాయిలో నిండటంతో, ఎగువన ఉన్న తమ కాలనీలు నీట మునుగుతున్నాయని స్థానికులు కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు.

చెరువు నీటిమట్టాన్ని తగ్గిస్తే ముంపు తగ్గుతుందని వారు సూచించారు. ఈ విషయంపై ఇరిగేషన్, జీహెచ్‌ఎంసీ అధికారులతో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని రంగనాథ్ హామీ ఇచ్చారు. క్లౌడ్ బరస్ట్ వంటి పరిస్థితుల్లో గంటలోనే 15 సెంటీమీటర్ల వర్షం కురుస్తోంది. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులను తట్టుకునేలా మన వ్యవస్థలను బలోపేతం చేసుకోవాలి, అని ఆయన అన్నారు.

అమీర్‌పేట గాయత్రి కాలనీలో పర్యటించిన కమిషనర్, నాలాల్లో పూడిక తీయడం వల్ల వరద నీరు సాఫీగా వెళ్తోందని, ఇదే విధానాన్ని నగరవ్యాప్తంగా అమలు చేయాలని సూచిం చారు. స్థానికుల విజ్ఞప్తి మేరకు మిగిలిన ప్రాంతాల్లోనూ పూడికతీత పనులు చేపడతామని భరోసా ఇచ్చారు.