10-10-2025 12:00:00 AM
ఎల్బీనగర్, అక్టోబర్ 9 : ఎల్బీనగర్ నియోజకవర్గంలో ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ లోని ముంపు కాలనీల్లో గురువారం బీజేపీ రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి, అధికారులతో కలిసి ఎంపీ ఈటల రాజేందర్ పర్యటించారు. బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని వినూత్న కాలనీ, గాంధీ నగర్ సౌత్, అఖిలాండేశ్వరి కాలనీ, స్నేహమయి నగర్ కాలనీ, పీవీఆర్ కాలనీ తదితర పరిసర కాలనీలు భారీ వర్షాలకు ముంపునకు గురయ్యాయి.
ఆయా కాలనీల్లో పర్యటించి, స్థానికులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. ఎగువన ఉన్న గుర్రంగూడ అడవి ప్రాంతం నుంచి భారీ వరద రావడంతో అడ్డుగా ఉన్న కట్ట తెగి వినూత్న కాలనీ మీదుగా అనేక కాలనీల్లోకి వరద ప్రవేశించిందని కార్పొరేటర్ లచ్చిరెడ్డి వివరించారు. వరద భారీగా రావడంతో వినూత్న నగర్, గాంధీనగర్ సౌత్, అఖిలాండేశ్వరి కాలనీ, స్నేహమయి నగర్, పీవీఆర్ కాలనీ, పద్మావతి కాలనీలు నీట మునిగాయన్నారు.
దీనికి శాశ్వత పరిష్కారం కోసం భారీ స్ట్రామ్ వాటర్ డ్రైన్ నిర్మాణం చేపట్టి వరదను అరికట్టవచ్చని సూచించారు. ఈ సందర్భంగా ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ... ముంపు ప్రాంతాల్లో శాశ్వత పరిష్కారం కోసం కృషి చేస్తున్నానన్నారు. జలమండలి, జీహెచ్‌ఎంసీ, ఇరిగేషన్, హైడ్రా అధికారులతో మాట్లాడి వీలైనంత త్వరగా సమస్యను శాశ్వతంగా పరిష్కారమయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
అనంతరం హరిహరపురం లోని కాప్రాయి చెరువును పరిశీలించారు. శివారు ప్రాంతాల్లో రోడ్లు, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ నిర్మించుకునే విధంగా ప్రణాళిక సిద్ధం చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. కార్యక్రమంలో బీజేపీ డివిజన్ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రావు, జలమండలి జీఎం మహేందర్, ఈఈ రమేశ్ బాబు, డీఈ దామోదర్ రావు, ఇరిగేషన్ డీఈ శుక్లజ, జలమండలి డీజీఎం రాజగోపాల్, ఏఈ సతీశ్, ఇంజనీరింగ్ ఏఈ కార్తీక్, జలమండలి మేనేజర్ భవ్య, కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు, కాలనీవాసులు ఉన్నారు.
లాల్‌గడి మలక్ పేట్‌లో ఈటల రాజేందర్ పర్యటన
శామీర్ పేట్, అక్టోబర్ 9 : అలియాబాద్ మున్సిపల్ లాల్ గడి మలక్ పేట్ గ్రామంలో గురువారం మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ పర్యటించారు. గ్రామంలోని పలు కాలనీలో తిరుగుతూ ప్రజల నుండి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఎస్సీ కాలనీలో మురికి నీటి కాలువ ఏర్పాటు కోసం కృషి చేస్తానని ఎంపీ హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మేడ్చల్ రూరల్ జిల్లా బీజేపీ అధ్యక్షులు బుద్ది శ్రీనివాస్, మాజీ అధ్యక్షులు విక్రమ్ రెడ్డి, శామీర్ పేట్ మండల బీజేపీ అధ్యక్షులు కొరివి కృష్ణ ముదిరాజ్, మాజీ అధ్యక్షులు కైర యాదగిరి, లాల్ గడి మలక్ పేట్ గ్రామ మాజీ సర్పంచ్ లు అశోక్, కైర రమేష్, మాజీ ఎంపీటీసీ అలా రాజిరెడ్డి, నాయకులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.