calender_icon.png 10 October, 2025 | 8:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏడేళ్లుగా అసంపూర్తిగానే..!

10-10-2025 12:00:00 AM

  1. పూర్తి కాకుండానే శిథిలావస్థకు షాపింగ్ కాంప్లెక్స్ భవనం
  2. అదనపు నిధులు మంజూరు చేస్తేనే మోక్షం

ఘట్ కేసర్, అక్టోబర్ 9 (విజయక్రాంతి) : ఘట్ కేసర్ పట్టణంలో రైల్వేస్టేషన్ కు వెళ్లే దారిలో నిర్మిస్తున్న షాపింగ్ కాంప్లెక్స్ భవనం పనులు గత 7 సంవత్సరాలుగా అసంపూర్తిగా మిగిలిపోయాయి. గత జెడ్పీ చైర్ పర్సన్ సునీత మహేందర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే, మంత్రి మల్లారెడ్డి ఇరువురూ 2018 డిసెంబర్ 29న ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. జెడ్పీ నిధులు రూ. 60 లక్షలు, మండల పరిషత్ నిధులు రూ. 20 లక్షలు వెచ్చించి రెండు అంతస్తులు స్లాబ్ వేశారు.

భవన నిర్మాణం పూర్తి కావాలంటే మరో రూ. 40 లక్షలు అవసరమని అధికారులు తెలిపారు. గతంలో ఇక్కడ నిర్మించిన ప్రభుత్వ అతిథి గృహం ఉండేది. అనంతరం ప్రజల అవసరాల నిమిత్తం అందులో కొంతకాలం మండల పరిషత్ కార్యాలయం, పోలీస్ స్టేషన్, సాంఘీక సంక్షేమ వసతి గృహం నడిపించారు. ఇక్కడ రాజకీయ పార్టీలు, విద్యార్థి, కుల సంఘాలు సమావేశాలు నిర్వహించుకున్న సందర్భాలు ఉన్నాయి.

అప్పటి అతిథి గృహం శిథిలావస్థలోకి చేరడంతో అక్కడ నూతనంగా దుకాణ సముదాయాలు నిర్మించాలని స్థానిక పాలకులు నిర్ణయించారు. నిర్మాణంలో అసంపూర్తిగా ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ వైపు అధికారులు, ప్రజాప్రతినిధులు కన్నెత్తి చూడకపోవడంతో ప్రస్తుతం అసాంఘీక కార్యక్రమాలకు అడ్డాగా మారిందని స్థానికులు చెబుతున్నారు. ఉమ్మడి ఘట్ కేసర్  మండల ప్రాంత ప్రజలకు పలు విధాలుగా సేవలందించిన ఈస్థలంలో ప్రస్తుతం పేకాట, మధ్యం సేవించడం, ప్రైవేట్ వాహనాల పార్కింగ్ కు నిలయంగా మారిందని స్థానికులు వాపోతున్నారు.

దుకాణ సముదాయం నిర్మించి అద్దెకిస్తే నెలనెలా ఆదాయం వస్తుందని భావిస్తే నిధుల కొరతతో పనులు ముందుకు సాగడంలేదని ఇప్పటికైనా అధికారులు, స్థానిక  నాయకులు స్పందించి జిల్లా ఇంచార్జీ మంత్రి శ్రీధర్ బాబు, జిల్లా కలెక్టర్ మను చౌదరి దృష్టికి తీసుకువెళ్లి ప్రభుత్వం నుండి నిధులను రాబట్టి గత 7సంవత్సరాలుగా అసంపూర్తిగా ఉన్న భవన నిర్మాణం పనులు పూర్తి చేసి షాపింగ్ కాంప్లెక్స్ ప్రజలకు అందుబాటులోకి తేవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. 

వెంటనే పూర్తి చేయాలి..

గత ఏడు సంవత్సరాలుగా అసంపూర్తిగా ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ భవనం పనులను పూర్తి చేయాలి. షాపింగ్ కాంప్లెక్స్ భవన నిర్మాణ పనులు అసంపూర్తిగా ఉండడంతో ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది. 

 గాజుల వీరేందర్ యాదవ్, 

ఘట్‌కేసర్

నిధులు కేటాయించాలి..

అసంపూర్తిగా ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ భవన నిర్మాణం కు ప్రభుత్వం వెంటనే నిధులు కేటాయించి పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి, ఇప్పటికే ఆలస్యం జరిగింది

 మామిండ్ల రమేష్ యాదవ్, 

ఘట్‌కేసర్