17-08-2025 12:05:51 AM
చారిత్రక తెలంగాణలో గౌతమ బుద్ధుడి కాలంలో, ఆ తరువాత బౌద్ధం పరిఢివిల్లినట్లు అనేక ఆధారాలు లభ్యమయ్యాయి. ఈక్రమంలోనే నల్లగొండ జిల్లాలోని నాగార్జున సాగర్ ప్రాంతం బౌద్ధానికి కేంద్ర బిందువుగా ఉండేది. సాగర్‌తో పాటు దాని చుట్టుపక్కల ఉన్న అనేక ప్రదేశాల్లో బౌద్ధ ఆనవాళ్లు బయటపడ్డాయి. అటువంటి ప్రదేశమే ఫణిగిరి. ఫణి అనగా పాము, గిరి అనగా కొండ. పాము పడగ ఆకారంలో వున్న కొండ కాబట్టి దీనికి ఫణిగిరి అనే పేరు వచ్చినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. ఈ ఫణిగిరికి 2000 ఏళ్ల నాటి ఘనచరిత్ర వుంది. ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిన తరువాత నాగార్జున సాగర్ బుద్ధవనంను అభివృద్ధి చేశారు. అదే కాలానికి చెందిన ఫణిగిరిని సైతం టూరిస్ట్ ప్లేస్‌గా మార్చడానికి గత ప్రభుత్వం నిధులు కేటాయించింది.
సూర్యాపేట/నాగారం, విజయక్రాంతి :సూర్యాపేట జిల్లా కేంద్రం నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక బౌద్ధ ప్రాంతం. ఆంధ్రప్రదేశ్ పురావస్తు, మ్యూజియాల శాఖ ఈ ప్రాంతంలో తవ్వకాలు జరిపిన త ర్వాత కనుగొనబడింది. ఫణిగిరిలో ఒక పెద్ద స్తూ పం ఉన్న ఒక పెద్ద సముదాయం, స్తూపాలు నిర్మించిన రెండు పెద్ద సభామందిరాలు ఉన్నాయి. ఫణిగిరి వాస్తవ్యులైన ఆనాటి పెద్దలు చెప్పిన ఆధారాల ప్రకారం ఈ నిర్మాణాలను బ్రిటీష్ కాలంలో జైలు గదులుగా, ఆ తర్వాత నిజాం ప్రభుత్వ కాలం లో బందీఖానాలుగా ఉపయోగించినట్టు తెలుస్తుంది.
ఈ ప్రాంతపు పరిమాణాన్ని బట్టే ఈ ప్రాం తం బౌద్ధ కేంద్రంగా ఎంత ప్రాముఖ్యత కల్గిందో తెలుసుకోవచ్చు. ఈ సముదాయంలో నేల మీద ఒక ప్రత్యేక ప్రాంతంలో ఉన్న పెద్ద పాదముద్రలు బుద్ధనివిగా భావిస్తున్నారు. బౌద్ధ సన్యాసులకు చెం దిన విహారాలు మూడు ఉన్నాయి. 2001 నుంచి 2007 వరకు ఆరేళ్ల పాటు జరిగిన తవ్వకాలలో మహాస్తూపం, చైత్యగృహాలు,
ఉద్దేశిక స్తూపాలు, బుద్ధుని ప్రతిమలు, బౌద్ధుని చిహ్నాలు, జాతక కథలు, సిద్ధార్థ గౌతముని జీవిత ఘట్టాలు మలచిన అపురూప శిల్పాలు, శాతవాహనుల క్షేత్రాలు, ఇక్ష్వాకుల, మహావీరుల నాణేలు, మట్టి, సున్నపు బొమ్మ లు, పూసలు లభించాయి. ఉత్తర భారతదేశాన్ని దక్షిణాపథంతో కలిపే ఒకప్పటి జాతీయ రహదారిపై వెలసిన ఫణిగిరి హీనయాన, మహాయాన బౌద్ధశాఖలకు నిలయమై ప్రసిద్ధ బౌద్ధాచారుల ఆవాసాల కు కొలువై ఉన్నట్లు తెలిపే ఆధారాలు దొరికాయి.
తవ్వకాలలో బయటపడ్డ సీసపు నాణేలు
ఏప్రిల్ 2, 2024న ఫణిగిరి బౌద్ధక్షేత్రం వద్ద పురావస్తు శాఖ డైరెక్టర్ భారతి హోళీకేళి ఆధ్వర్యంలో తవ్వకాలు జరుపుతున్న క్రమంలో 3, 4వ శతాబ్దాలకు సంబంధించిన ఇక్ష్వాకుల కాలం నాటి 3,700 పైగా సీసపు నాణేలు (లెడ్ కాయిన్స్) లభ్యమయ్యాయి. పెద్దసంఖ్యలో ఇక్ష్వాకుల కాలానికి చెందిన నాణేలు వెలుగు చూడడం ఇదే ప్రధమం.
ఈ ఐదేళ్ల క్షేత్ర తవ్వకాలలో సున్నపురాయితో చేసిన 6 అడుగుల బౌద్ధశిల్పం ఇక్కడ లభించింది. అలాగే సాధారణంగా బౌద్ధారామాల్లో బంగారు వస్తువులు లభించవు. కానీ గతంలో జరిపిన తవ్వకాల్లో ఇక్కడ రోమన్ చక్రవర్తి నెర్వి (కీ.శ. 96 విడుదల చేసిన 7.3 గ్రాముల బరువుగల బంగారు నాణెం కూడా బయటపడడం విశేషం.
రెండో భద్రాద్రి
రెండో భద్రాద్రిగా పేరుగాంచిన శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం ఈ కొండకు దిగువున ఉన్న మెలిక ప్రదేశంలో వుంది. ఇది కాకతీయుల కాలంలో ఎంతో పేరుప్రతిష్టలతో నిత్య ధూప, నైవేద్యాలతో విరాజిల్లుతూ వుండేది. ఇక్కడ జాతరలు కూడా నిర్వహించేవారు.
మూడు నిర్మాణాలు
ఆలయం చుట్టూ రాతికట్టడాలు, పెద్దపెద్ద రాతి స్థంభాలు, కల్యాణ మండపం, కోనేరు, ద్వారపాలకులు, ఆంజనేయస్వామి విగ్రహం, శివలింగం, నాగదేవత చుట్టూ చెట్లు పచ్చని ప్రకృతితో ఒకనాడు అద్భుతంగా వుండేది. ఫణిగిరి కొండకు దిగువన ఒక కి.మీ దూరంలో మనకు 3 నిర్మాణాలు కనిపిస్తాయి. ఐతే ఈ సీతా రామమం ద్రస్వామి వార్ల కల్యాణ మహోత్సవం హోళీ పండుగ రోజున నిర్పహిస్తారు. 15 రోజుల పాటు సీతారామచంద్రస్వామి ఉత్సవాలు నిర్వహిస్తారు.
స్వామి వారి పేరిట భూములు
సీతారామచంద్ర స్వామి పేరిట 150 ఎకరాల భూములు ఉన్నట్లు స్థానికుల ద్వారా తెలుస్తోంది. ఇవి ఫణిగిరి, చెన్నాపురం, ఈటూరు గ్రామాల్లో ఉన్నాయి. ఏటా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఆలయ భూములకు 100 ఎకరాలకు గాను వేలంపాట నిర్వహిస్తారు. అయితే ఆలయంలో గుప్త నిధుల కోసం గతంలో తవ్వకాలు జరిపిన ఆనవాళ్లు ఉన్నాయి. ఆలయ పైకప్పు భాగం వర్షం వస్తే కురుస్తున్నది. (స్లాబ్ శిథిలావస్థలో ఉన్నది). అయినా దీనిని ఎవరూ పట్టించుకోవడం లేదంటూ పెదవి విరుస్తున్నారు.
శాసనాల లభ్యం ఇక్కడే
శ్రీ పర్వత, విజయపురిలను పాలించిన ఇక్ష్వాక రాజు ఎహువల శాంతమూలుని 18వ పాలన కాలానికి సంబంధించిన శాసనాలు ఇక్కడ లభించాయి. ఇంతవరకు ఆ రాజు 11 సంవత్సరాలు మాత్రమే పాలించిన ఆధారాలు లభించగా 18 ఏళ్లు ఆ రాజు పాలించాడని తెలిపే శాసనం ఇక్కడ లభించింది. అదే శాసనంలో శ్రీ కృష్ణుని ప్రస్తావన కూడా ఉంది. ఇలా కృష్ణుని పేర్కొన్న తొలి శాసనం కూడా ఫణిగిరి దగ్గర దొరకడం మరో ప్రత్యేకత.
ఇదో పర్యాటక కేంద్రం
ఈ బౌద్ధారామాన్ని చైనా, భూపాల్, భూటాన్, శ్రీలంక, బ్రిటన్ తదితర దేశాల నుంచి బౌద్ధ మతస్థులు సందర్శించారు. బుద్ధుని చరిత్రపై పరిశోధనలు చేయడానికి వేలాదిమంది విద్యార్థులు, పరిశోధకులు, బౌద్ధ్ద సన్యాసులు, పర్యాటకులు ఇక్కడ వస్తుంటారు.
ప్రత్యేకత లెన్నో
ఫణిగిరి కొండపైన బౌద్ధారామం, కింద కోదండరామ స్వామి, అలయం పక్కనే పెద్ద చెరువు రాతిగుట్టల మధ్య ఉండడం గొప్ప విశేషం. నిజానికి ఇది మూడు చెరువుల కలయిక. ఒక చెరువు పైనుంచి ఎస్సారెస్పీ కాలువ వెలుతుండడంతో ప్రతి యేటా ఈ చెరువు నీటితో కళకళలాడుతుంది. రూ.25 లక్షలతో మ్యూజియం
కొండపై జరిగిన తవ్వకాలలో బయల్పడిన బౌద్ధ శిల్పాలు, సీసపు నాణేలు లాంటి ఎన్నో విలువైన వస్తు సంపదకు ప్రత్యేక మ్యూజియం లేకపోవడంతో గతంలో వీటికి రక్షణ లేకుండా పోయింది. దీంతో ఇక్కడ దొరికిన విగ్రహాలను కొన్నింటిని పానగల్లు మ్యూజియంలో, మరికొన్నింటిని హైదరాబాద్‌లోని మ్యూజియానికి తరలించారు. మిగిలిన వాటిని గ్రామంలోని ఓ పాత భవనంలో వుంచారు. ఐతే భావితరాలకు ఘనచరిత్రను అందించాలనే సంకల్పంతో గత ప్రభుత్వం రూ.25 లక్షలు వెచ్చించి బుద్ధిస్ట్ ఆర్కియాలజీ మ్యూజియాన్ని ఏర్పాటు చేసింది. 5 అక్టోబర్ 2023న ప్రారంభించగా ఇందులో మిగిలిన వస్తుసంపదను భద్రపరిచారు.
ఎలా వెళ్లాలంటే
సూర్యాపేటకు ఇది 40కి.మీ. దూరములో ఉంది. ఇక్కడి నుంచి పరిసర గ్రామాలకు రోడ్డు వసతి కలిగి బస్సుల సౌకర్యము ఉంది. ఈ గ్రామానికి సమీపములో రైలు వసతి లేదు. హైదరాబాద్ నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫణిగిరికి రోడ్డుమార్గాన చేరుకోవచ్చు. వరంగల్ నుంచి 82 కిలోమీటర్లు, నల్గొండ నుంచి 84 కిలోమీటర్లు దూరం ఉంది. సమీప రైల్వే స్టేషన్ నల్గొండ.