11 May, 2026 | 12:11 AM

మెట్రో రైలు శబ్ద కాలుష్యంపై పిల్

25-04-2024 01:22 AM

l వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి, మెట్రో ఎండీకి హైకోర్టు నోటీసులు

హైదరాబాద్, ఏప్రిల్ 24 (విజయక్రాంతి) : మెట్రో రైలు ప్రయాణ సమయంలో మలుపుల్లో పెద్ద శబ్దం వస్తోందంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి, మెట్రో రైలు ఎండీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మలుపుల్లో పరిమితికి మించి శబ్ధ కాలుష్యం వెలువడుతోందని, సికింద్రాబాద్‌లోని బోయిగూడ మెట్రో పిల్లర్ 1006 వద్ద రైల్వే ట్రాక్ వంపులో శబ్ద కాలుష్యం వెలువడుతోందంటూ డాక్టర్ హనుమాన్లు అనే వ్యక్తి హైకోర్టుకు లేఖ రాశారు. దీనిని ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా పరిగణించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే, జస్టిస్ జే అనిల్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం విచారించింది.

ప్రతివాదులైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, నగర పోలీసు కమిషనర్, ఇతర పోలీసులతో పాటు మెట్రో రైలు ఎండీ, మెట్రో రైలు డిప్యూటీ చీఫ్ ఇంజినీరు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను వాయిదా చేసింది. పరిమితికి మించిన శబ్ధం వెలువడటంతో ప్రజలకు వినికిడి సమస్యలతో పాటు బీపీ పెరిగే ప్రమాదం ఉందని పిటిషనర్ లేఖలో పేర్కొన్నారు. 2010లో పర్యావరణ శాఖ జారీ చేసిన జీఓ 172 ప్రకారం పగలు 55, రాత్రిపూట 45 డెసిబుల్స్ మించి శబ్ధం ఉండరాదన్నారు. కొత్తబోయిగూడ పిల్లర్ బీ1006 ట్రాక్ వంపులో శబ్దాన్ని తగ్గించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.  పర్యావరణ పరిరక్షణ చట్టం 1986, కాలుష్య నియంత్రణ నిబంధనల ప్రకారం మితిమీరిన శబ్ధంతో కూడిన హారన్లు కూడా వేయకూడదన్నారు.