24-10-2025 09:49:26 AM
న్యూఢిల్లీ: కర్నూలు జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం(Kurnool bus accident) సంభవించింది. మంటలు చెలరేగి వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు(Vemuri Kaveri Travels bus) పూర్తిగా దగ్ధం అయింది. పల్సర్ బైక్ ను ఢీకొట్టడంతో బస్సులో మంటలు చెలరేగాయి. వోల్వా బస్సు మంటల్లో పూర్తిగా కాలి బూడిదైంది. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు సజీవ దహనం అయ్యారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కర్నూలు బస్సు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోడీ(PM Narendra Modi) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
మృతుల కుటుంబాలకు మోడీ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం చాలా బాధాకరం అన్నారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రులకు రూ. 50 వేల తక్షణ సాయం అందిస్తున్నట్లు ప్రధాని మోడీ స్పష్టం చేశారు. కర్నూలు బస్సు ప్రమాదంలో నెల్లూరు జిల్లాకు చెందిన కుటుంబం మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. బెంగళూరులో స్థిరపడిన వింజమూరు మండలం గొల్లవారిపాలెంకు చెందిన రమేష్ కుటుంబం హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో రమేష్ దంపతులు సహా ఇద్దరు పిల్లలు ప్రాణాలు కోల్పోయారు.