calender_icon.png 8 November, 2025 | 5:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘పాక్’ది కుట్రల చరిత్ర

08-11-2025 01:07:25 AM

  1. అక్రమ కార్యకలాపాలు ఆ దేశానికి కొత్తకాదు
  2. భారత విదేశాంగశాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్
  3. పాక్ అణు పరీక్షలు చేస్తుందన్న ట్రంప్ వ్యాఖ్యలపై స్పందన

న్యూఢిల్లీ, నవంబర్ 7: ‘పాకిస్థాన్‌ది మొదటి నుంచి కుట్రలు, కుతంత్రాల చరిత్ర. దశాబ్దాల నుంచి పాక్‌దే అదే ధోరణి. రహస్య విధానాలు, అక్రమ కార్యకలాపాలు, అంతర్జాతీయ నియమాలు, నిబంధనల ఉల్లంఘన పాక్‌కు వెన్నతో పెట్టిన విద్య. అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన ఆ దేశానికి కొత్తేమీ కాదు.’ అని భారత విదేశాంగశాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తీవ్రమైన విమర్శలు చేశారు.

‘పాకిస్థాన్ రహస్యంగా అణ్వాయుధ పరీక్షలు చేస్తున్నది. అదే బాటలో మేమూ పయనిస్తాం. మేము సైతం మా దేశంలో అణు పరీక్షలు చేయబోతున్నాం’ అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆ వ్యాఖ్యలపై న్యూఢిల్లీలో శుక్రవారం  రణధీర్ జైస్వాల్  మీడియా సమావేశం నిర్వహించారు. పాకిస్థాన్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.

ఒకవేళ అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధంగా ఒకవేళ పాక్ రహస్యంగా అణ్వాయుధ పరీక్షలు నిర్వహిస్తే ఇది అంతర్జాతీయ సమాజానికి హెచ్చరిక అని అభిప్రాయపడ్డారు. భారత్ ఈ అంశాలను అంతర్జాతీయ సమాజం దృష్టికి భారత్ ఎల్లప్పుడూ తీసుకెళ్తూనే ఉంటుందన్నారు. వచ్చే ఏడాది భారత్‌లో పర్యటిస్తానని ట్రంప్ చేసిన ప్రకటన గురించి అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. దీనిపై ప్రస్తుతానికి తమకు ఎటువంటి సమాచారం లేదన్నారు.

ప్రపంచంలో చాలా దేశాలు చురుగ్గా అణ్వాయుధాలను పరీక్షిస్తున్నాయని, ఆ జాబితాలో పాకిస్థాన్ ఉందని అమెరికా అధ్యక్షుడు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. రష్యా, చైనా, ఉత్తరకొరియా, పాకిస్థాన్ వంటి దేశాలు అణు పరీక్షలను నిర్వహిస్తున్నాయని, వాళ్లనెవ్వరూ ప్రశ్నించరని అన్నారు. తాము మాత్రం బహిరంగంగానే చెబుతామని తేల్చిచెప్పారు. ఇన్నాళ్లూ ఎన్ని దేశాలు అణు పరీక్షలు చేపట్టినా వాటి జోలికి వెళ్లలేదని.. ఇకపై అలా మిగిలిపోవాలనుకోవట్లేదని కుండబద్దలు కొట్టారు.