01-09-2025 01:01:53 PM
గార్ల/మహబూబాబాద్ (విజయక్రాంతి): గత 15 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) గార్ల మండల పరిధిలోని రాంపురం పరిసర ప్రాంతంలో ఉన్న పాకాల ఏరు ఉధృతంగా ప్రవహిస్తుంది. నీటి ప్రవాహం పెరిగిపోవడంతో వరి పంట నీట మునిగిపోయింది. 15 రోజులుగా రాంపురం, మద్దివంచ గ్రామాల ప్రజలకు గార్ల పట్టణ కేంద్రానికి రావడానికి కష్టతరంగా మారింది. పంట సాగుకు కావలసిన ఎరువులు, పురుగు మందులు తీసుకోవడానికి గార్ల మండల కేంద్రానికి ప్రజలు రాలేక పత్తి, మొక్కజొన్న పంటలు చీడపీడల బారిన పడుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాకాల ఏటిపై హై లెవెల్ వంతెన నిర్మాణానికి ఇప్పటికైనా పాలక ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.