22-11-2025 04:03:23 PM
ఇసుక తరలింపును అడ్డుకుని అరెస్టు చేసిన పోలీసులు
రెండు కార్లు, రెండు టిప్పర్లు స్వాధీనం
కామారెడ్డి,(విజయక్రాంతి): అక్రమ ఇసుక దందాకు కొత్త ఎత్తుగడ వేసిన నిర్వాహకులకు పోలీసులు చెక్ పెట్టారు. కామారెడ్డి జిల్లా మద్నూర్ పోలీసులు రెండు టిప్పర్లు, రెండు కార్లను పట్టుకొని అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ఆరుగురిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర శనివారం తెలిపారు. అక్రమ ఇసుక దందా నిర్వాకులు రెండు కార్లలో ఎస్కార్ట్ గా ముందుగా వెళుతూ వెనుక ఇసుక టిప్పర్లు ను తరలిస్తుండగా మద్నూర్ పోలీసులు అడ్డుకొని అక్రమ ఇసుక రవాణాలను అడ్డుకున్నారు.
ఎలాంటి అనుమతులు లేకుండా నిజాంబాద్ జిల్లా పోతంగల్ వద్దగల మంజీరా నది నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారని సమాచారం మేరకు మద్నూర్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఇసుక స్మగ్లర్ల కొత్త ఎత్తుగడకు పోలీసులు చెక్ పెట్టారు. కార్లలో ఉన్న నలుగురు, టిప్పర్ డ్రైవర్ లు ఇద్దరు నీ పోలీసుల అరెస్టు చేసినట్లు ఎస్పి వెల్లడించారు. కర్ణాటకకు అక్రమ ఇసుకను టిప్పర్లలో తరలిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. పట్టుబడిన వారిలో కర్ణాటక రాష్ట్రం బీదర్ జిల్లా హౌరద్ మండలం డిగ్రీ గ్రామానికి చెందిన ఉమాకాంత్, మస్కాలే శివాజీ, హౌరాద్ కు చెందిన బుట్టే రాజకుమార్, హైదరాబాదుకు చెందిన దేవా, ఆలపాటి రవి, పవర్ చందర్, అప్పాజీ లను పోలీసులు పట్టుకుని అరెస్టు చేసినట్లు తెలిపారు.