22-11-2025 04:06:30 PM
కలెక్టర్ హనుమంతరావు
వలిగొండ,(విజయక్రాంతి): రైతు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని రైతులు తమ ధాన్యాన్ని మధ్య దళారులకు అమ్మి మోసపోవద్దని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. శనివారం మధ్యాహ్నం వలిగొండ మండల కేంద్రంలోని మార్కెట్ యార్డును ఆయన ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడుతూ అకాల వర్షాలతో రైతులు కొంత ఇబ్బంది పడ్డారని ప్రస్తుతం పరిస్థితి చక్కబడిందని మిల్లర్లు వెంటనే ధాన్యం దిగుమతి చేసుకోవాలని సూచించడం జరిగిందని అన్నారు.
ధాన్యం తరలించేందుకు అవసరమైన లారీలను వెంటనే ఏర్పాటు చేయాలని కాంట్రాక్టర్ ను ఆదేశించడం జరిగింది. ఇప్పటివరకు 1,20,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగిందని రైతుల ఖాతాలలో 80 కోట్లు రూపాయలు జమ చేయడం జరిగిందని ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే రైతుల ఖాతాలో డబ్బులు పడుతున్నాయని అన్నారు.
టాబ్ ఎంట్రీ పనులను కూడా వెంటనే పూర్తి చేయాలని సూచించడం జరిగింది. పత్తి కొనుగోలు విషయంలో కొత్త విధానంలో స్లాట్ బుకింగ్ ఉన్నందున రైతులు అవగాహన చేసుకోవాలని మాయిశ్చరైజే చూసుకొని కొనుగోలు కేంద్రాలకు తీసుకు వచ్చినట్లయితే ఆలస్యం జరగదని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ దశరథ, మండల వ్యవసాయ అధికారిని అంజనీదేవి, ఎంఆర్ఐ కరుణాకర్ రెడ్డి పాల్గొన్నారు.