10-05-2025 01:27:37 AM
ఎస్పీ సుధీర్ రామ్‌నాథ్ కేకన్
మహబూబాబాద్, మే 9 (విజయ క్రాంతి): దేశవ్యాప్తంగా నెలకొన్న యుద్ద వాతావరణం, కర్రెగుట్టలో మావోయిస్టుల అలజడుల నేపథ్యంలో శుక్రవారం మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. జిల్లా సరిహద్దున ఉన్న ప్రధాన రహదారులతో పాటు జిల్లా కేంద్రానికి ఇతర మండలాలతో అనుసంధామైన రహదారులపై పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు.
అలాగే జనసమ్మర్థం ఉండే బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ఇతర ప్రాంతాల్లో అనుమానస్పద వ్యక్తులు, వాహనాలను డాగ్ స్క్వాడ్, బాంబు స్క్వాడ్ ద్వారా తనిఖీలు చేసి పంపిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానిత వ్యక్తులను తనిఖీ చేయాలని, ప్రజలు ఎక్కువగా ఉండే ప్రాంతాలపై ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్పీ సుదీర్ రామ్నాథ్ కేకన్ పోలీసులను ఆదేశించారు.
ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, ఏమైనా అనుమానాస్పద వస్తువులు, వ్యక్తులు కనిపించినా వెంటనే 100 కు డయల్ చేసి చెప్పాలని కోరారు. ప్రజల సహకారంతో పటిష్టమైన భద్రత, ప్రజారక్షణకు తోడ్పడుతుందని చెప్పారు. తనిఖీలకు ప్రజలు సహకరించాలని కోరారు.