06-12-2025 11:04:28 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో శనివారం పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్, ఆర్ఐ అనిల్ సూచనల మేరకు, పట్టణ సీఐ మహేందర్ రెడ్డి పర్యవేక్షణలో ఎస్సై షాకీర్ నేతృత్వంలో మహబూబాద్ టౌన్ పోలీసు వ్యవస్థ ముందస్తు భద్రతా చర్యలను చేపట్టింది. ఈ క్రమంలో పట్టణంలోని ప్రముఖ మసీదులు, దర్గాలు, ప్రజలు అధికంగా రద్దీ అయ్యే తొర్రూర్ బస్టాండ్, నెహ్రూ సెంటర్, మదర్ తెరిసా సెంటర్, బస్టాండ్ పరిసరాలు, ప్రముఖ దేవాలయాలు, రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫారంల వద్ద బాంబ్ స్క్వాడ్ బృందం తనిఖీలు నిర్వహించింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ప్రతి మూలనా నిఘా కట్టుదిట్టం చేశారు. తనిఖీలలో బాంబ్ స్క్వాడ్ సిబ్బంది, డాగ్ హ్యాండ్లర్, బ్లూకోట్ సిబ్బంది పాల్గొని ప్రాంతాలను సంపూర్ణంగా పరిశీలించారు. ప్రజల భద్రతను ప్రధానంగా భావిస్తూ పోలీసులు నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు.