22-10-2025 12:32:31 AM
కరీంనగర్‌లో ఫ్లాగ్ డే నిర్వహణ
కరీంనగర్ క్రైం, అక్టోబర్ 21(విజయక్రాంతి);పోలీస్ అమరవీరుల దినోత్సవాన్నిపురస్కరించుకుని కరీంనగర్ పోలీస్ కమీషనరేట్ కేంద్రంలోని పోలీసు అమరవీరుల స్థూపం వద్ద మంగళవారంనాడు ’ఫ్లాగ్ డే’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి హాజరయ్యారు. కరీంనగర్ పోలీసు కమీషనర్ గౌష్ ఆలం అధ్యక్షత వహించారు. కలెక్టర్ శ్రీమతి పమేలా సత్పతి మాట్లాడుతూ, పోలీసుల త్యాగం మరువలేనిదని కొనియాడారు.
దేశమంతా ప్రజలు పండుగలు కుటుంబ సభ్యులతో జరుపుకుంటున్న సమయంలో కూడా పోలీసులు విధుల్లో నిమగ్నమై ప్రజలను రక్షిస్తారని తెలిపారు. అటువంటి చిన్న చిన్న త్యాగాల నుండి మొదలుకొని అవసరమైతే విధి నిర్వహణలో ప్రాణాలను సైతం త్యాగం చేస్తారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీసు అమరవీరులందరికీ నమస్సుమాంజలి తెలియజేశారు.పోలీసు కమీషనర్ గౌష్ ఆలం మాట్లాడుతూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా నక్సల్స్ ప్రభావిత ప్రాంతంగా ఉండేదని, ఎంతో మంది ప్రాణ త్యాగం ఫలితంగానే ఈ రోజు స్వేచ్ఛగా జీవించగలుగుతున్నామని తెలిపారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా విధి నిర్వహణలో 47 మంది పోలీసు అధికారులు ప్రాణత్యాగం చేశారని గుర్తుచేశారు. ఈ సందర్భంగా దేశ రక్షణకోసం, సమాజంలో శాంతి భద్రతలు కాపాడటంలో భాగంగా విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీసులను స్మరించుకుని నివాళులు అర్పించామని తెలిపారు.దేశవ్యాప్తంగా 191 మందికి పైగా అన్ని విభాగాల పోలీసులు అమరులయ్యారని, వారి త్యాగాలు ఎప్పటికీ వృధా కావని కమీషనర్ పేర్కొన్నారు.
అమరుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రజలు ప్రశాంతంగా ఉండేలా, శాంతి భద్రతలు కాపాడే విధంగా విధులు నిర్వహిస్తామని తెలిపారు. అమరవీరుల కుటుంబ సభ్యులకు పోలీసు శాఖ ఎల్లవేళలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. వారిని స్మరించుకుంటూ ఈ నెల 31 వరకు 10 రోజుల పాటు పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు.అనంతరం అమరవీరుల విగ్రహానికి కరీంనగర్ సాయుధ బలగాలు గౌరవ వందనం సమర్పించాయి. కార్యక్రమంలో డీసీపీలు వెంకటరమణ, భీం రావు లతో పాటు కమీషనరేటులోని పోలీసు అధికారులు, అమరవీరుల కుటుంబసభ్యులుపాల్గొన్నారు.