25-10-2025 10:45:28 PM
నిజామాబాద్ (విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లా ఆలూర్ మండలం కేంద్రానికి చెందిన కుర్మే బీజ చిన్న రాజేష్(45) గల్ఫ్ దేశంలోని ఇరాక్‌లో ప్రమాదవశాత్తు మృతి చెందాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగోలేక, జీవనోపాధి కోసం సుమారు ఒకటిన్నర సంవత్సరం క్రితమే రాజేష్ విదేశాలకు వెళ్లాడు. అక్కడ ఒక కట్టడం పనిలో పనిచేస్తూ నిన్న ప్రమాదవశాత్తు బ్రిడ్జ్ పై నుంచి కిందపడిపోయి అక్కడికక్కడే మృతి చెందినట్లు శనివారం కుటుంబీకులు తెలిసింది.
మృతుడు రాజేష్‌కు అమ్మ, భార్య సునీత, ముగ్గురు కూతుర్లు ఉన్నారు. ఆకస్మిక మరణవార్త తెలిసిన కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. రాజేష్ మృతదేహాన్ని స్వదేశానికి, ఆలూర్ గ్రామానికి తేవడానికి ప్రభుత్వ సహాయం అందించాలని కుటుంబ సభ్యులు వినతిచేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని మృతదేహాన్ని గ్రామానికి రప్పించేలా చూడాలని కుటుంబీకులు గ్రామస్తులు కోరారు.