13-10-2025 12:33:21 AM
-‘పల్స్ పోలియో’ ప్రారంభంలో కలెక్టర్ హరిచందన
-జిల్లా వ్యాప్తంగా 5.17 లక్షల మంది చిన్నారులే లక్ష్యం
-ఈ నెల 15 వరకు ప్రత్యేక డ్రైవ్
హైదరాబాద్, సిటీ బ్యూరో అక్టోబర్ 12 (విజయక్రాంతి): చిన్నారుల ఉజ్వల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు తప్పనిసరిగా ఐదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాలని కలెక్టర్ హరిచందన దాసరి పిలుపునిచ్చారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఆదివారం తిలక్ నగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు వేశారు.
అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి విస్తృత ఏర్పాట్లు చేసిన ట్లు తెలిపారు. జిల్లావ్యాప్తంగా -5 ఏళ్లలోపు వయసున్న 5,17,238 మంది చిన్నారులను గుర్తించామని, వారందరికీ పోలియో చుక్క లు వేయడమే లక్ష్యమని ఆమె పేర్కొన్నారు. ఇందుకోసం 2,586 పోలియో కేంద్రాలను ఏర్పాటు చేశామని, అలాగే 91 మొబైల్ బృందాలు వలస కార్మికులు నివసించే ప్రాంతాలు, మార్కెట్లు, బస్టాండ్లు, రైల్వే స్టేష న్లు, పార్కులు, ప్రార్థనా మందిరాల వద్ద సేవలందిస్తాయని వివరించారు.
ముఖ్యంగా 164 హై రిస్క్ ప్రాంతాల పై ప్రత్యేక దృష్టి సారించామని, అక్టోబర్ 15వ తేదీ వరకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆదివారం పోలియో చుక్కలు వేయించుకోలేని చిన్నారుల కోసం సోమవారం నుంచి బుధవారం వరకు వైద్య సిబ్బంది ఇంటింటికీ తిరిగి, చుక్కలు వేస్తారని కలెక్టర్ వివరించారు. ఈ కార్యక్రమంలో సుమారు 11,200 మంది వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ టీచర్లు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, పారామెడికల్ విద్యార్థులు పాల్గొంటున్నారని చెప్పారు.
అపార్ట్ మెంట్లలో నివసించే తల్లిదండ్రులు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటి, డీఎంఓ రాములు, డిప్యూటీ డీహెఓ డాక్టర్ పద్మజ, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ దీప్తి, ఇతర వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.