calender_icon.png 13 October, 2025 | 10:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మద్యం విక్రయానికి నయా రూల్ కు మరో ముందడుగు

13-10-2025 07:32:37 PM

- యువత మద్యం మత్తు వదిలి ఆర్థికంగా ఎదగాలి..

- సాయంత్రం 4:00 గంటల నుండి రాత్రి 9:00 గంటల వరకే మధ్యాన్ని విక్రయించాలి

- వాల్ పోస్టర్లను విడుదల చేసిన కాంగ్రెస్ ముఖ్య నాయకులు

మునుగోడు,(విజయక్రాంతి): నియోజకవర్గ ప్రజలు యువత మద్యం మత్తు వదిలి ఆర్థికంగా ఎదగాలని,ఆరోగ్యం బాగుపడితే  వారి జీవన ప్రమాణాలు మెరుగు పడి, ఇంట్లో యజమాని తాగకుండా ఉంటే మహిళలు ఆర్థికంగా సాధికారత సాధిస్తారని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నూతన వైన్ షాపులకు టెండర్ల ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో  మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న వైన్ షాపులకు టెండర్లు వేసే  వారికి కొన్ని సూచనలు చేశారు.

నియోజకవర్గంలో ఇప్పటికే విచ్చలవిడిగా మద్యం  అందుబాటులో ఉన్న నేపథ్యంలో బెల్ట్ షాపుల నిర్మూలన ఉద్యమం  చేపట్టి గ్రామాలలో బెల్ట్ షాపులు లేకుండా చేసి, మద్యం విగ్రహానికి నయా రూల్తో మరో అడుగు వేశారు. ఊరి బయట మాత్రమే వైన్ షాపులను పెట్టుకోవాలని, సిట్టింగు లేకుండా చూసుకోవాలని, బెల్ట్ షాపులకు మద్యం విక్రయించొద్దని, వైన్ షాపుల యజమానులు సిండికేట్ గా మారుద్దని, మద్యాన్ని సాయంత్రం 4:00గంటల నుండి రాత్రి 9:00 గంటలకు మాత్రమే విక్రయించుకోవాలని సూచించారు.

గ్రామాలలో పర్యటిస్తున్న సందర్భంలో  యువత తాగుడుకు బానిసై విచక్షణారహితంగా ప్రవర్తించడం  చూశానని, ఎంతోమంది యువకులు 30 ఏళ్ల లోపు వారే  తాగుడుకు బానిసై చనిపోతే మహిళలు చిన్నతనంలోనే భర్తను కోల్పోయి  ఆ కుటుంబాలు రోడ్డు పాలవుతున్నాయని తమ పిల్లలను పోషించడానికి వారు పడరాని పాట్లు పడుతున్న ఆవేదనలో నుండి వచ్చిన నిర్ణయమే బెల్ట్ షాపుల నిర్మూలన, మద్యం షాపుల సమయాల మార్పు అన్నారు. కొన్ని అంశాలతో కూడిన వాల్ పోస్టర్లను మునుగోడు నియోజకవర్గం కాంగ్రెస్ ముఖ్య నాయకులు  విడుదల చేశారు.