31-01-2026 09:10:58 PM
ప్రభుత్వానికి విజన్ లేదు
రాజకీయ నాయకులు ప్రజా సేవకులు
మీడియా చిట్ చాట్ లో మాజీ ఎంపీ వినోద్ కుమార్, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, పార్టీ జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణారావు
మానకొండూరు,(విజయక్రాంతి): ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి రాజకీయ రంగు పులిమి కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ పై అనవసర రాద్ధాంతం చేస్తుందని మాజీ పార్లమెంట్ సభ్యులు వినోద్ కుమార్ మండిపడ్డారు. కేసీఆర్ ను ప్రశ్నించడం అసలు సమంజసం కాదన్నారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే కేసీఆర్ ను (నేడు) ఆదివారం విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇవ్వడం పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
శనివారం మండల కేంద్రమైన మానకొండూరులోని భారాస కార్యాలయంలో మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, భారాస కరీంనగర్ జిల్లా అధ్యక్షులు జీ వీ రామకృష్ణారావు పార్టీ మండలాధ్యక్షులు తాళ్లపల్లి శేఖర్ గౌడ్, సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, నాయకులు శాతరాజు యాదగిరి, రామంచ గోపాల్ రెడ్డి, దండబోయిన శేఖర్ తదితరుతో కలిసి వినోద్ కుమార్ మీడియా చిట్ చాట్ లో మాట్లాడారు. ప్రభుత్వానికి విజన్ కరువైందని అందుకే అభివృద్ధి తిరోగమనలో పయనిస్తుందని ధ్వజమెత్తారు.
రెండున్నర సంవత్సరాల పాలనలో కాంగ్రెస్ నాయకులు కొత్త రోడ్ల మాట దేవుడెరుగు కనీసం ఉన్న రోడ్లకు మరమ్మతులు చేశారా అని మీడియా సాక్షిగా నిలదీశారు. సంవత్సరం 2012 లో తీగల వంతెనకు ఆలోచన చేసి 2014 సంవత్సరములో పూర్తిచేసి కరీంనగర్ పట్టణానికి తలమానికంగా తీర్చిదిద్దామన్నారు.
ప్రస్తుతం రాత్రి వేళల్లో కనీసం విద్యుత్తు దీపాలు సైతం వంతెనపై వెలగని దుస్థితిలో కొట్టుమిట్టాడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి సోయి లేదు, నాయకులకు తీరికలేదు అందుకే అభివృద్ధి కుంటుపడిందని ఆరోపించారు. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో లేని భారాస నాయకులకు ఓటు వేయడం ఎందుకని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. అధికారం, పదవులు ఏ ఒక్కరికి శాశ్వతం కాదన్నారు.
నేడు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు
భారాస కరీంనగర్ జిల్లా అధ్యక్షులు జీ వీ రామకృష్ణారావు
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నేడు (ఆదివారం) కేసీఆర్ ను హాజరుకావాలని సిట్ నోటీసులు ఇవ్వడం పై పార్టీ పక్షాన వ్యతిరేకిస్తున్నామని భారాస కరీంనగర్ జిల్లా అధ్యక్షులు జీ వీ రామకృష్ణారావు చెప్పారు. సిట్ పిలుపును ఖండిస్తున్నామన్నారు. ఈ రాజకీయ కక్ష సాధింపు చర్యలపై నిరసన వ్యక్తం చేస్తూ ఆదివారం పార్టీ పక్షాన ఆందోళన కార్యక్రమాలు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహిస్తున్నామని రామకృష్ణారావు తెలిపారు. పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఈ ర్యాలీ, రాస్తారోకో, నిరసన కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.