01-05-2025 12:40:24 AM
కల్లూరు ఏప్రిల్ 30 :- ఇందిరమ్మ మోడల్ హౌస్ శంకుస్థాపన కార్యక్రమంలో రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖామంత్రి పొంగిలేటి శ్రీనివాస రెడ్డి పార్టీలకు అతీతంగా ఎవరైతే అర్హులు ఉన్నా రో వారికే ఇండ్లు కేటాయించాలని నాయకులకు, కార్యకర్తలకు సూచించారు. కానీ ప్రస్తుతం మండలంలోని ఇందిరమ్మ ఇండ్లు కేటాయింపులో మంత్రి మాటలను బేకాతర్ చేస్తూ ఇష్టమొచ్చినట్లుగా వారికి నచ్చిన వారికి ఇండ్లు కేటాయిస్తున్నారని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. అర్హత జాబితాలో ఉండి తమకు ఇల్లు వస్తుందని తమ కష్టాలు తీరిపోతాయని కోటి ఆశలతో ఎదురుచూస్తున్న నిజమైన లబ్ధిదారులకు చుక్కెదురైంది.
భూమి ఉండి సొంత భవనం కలిగిన వారికి ఇల్లు కేటాయిస్తూ అస్సలు ఇల్లు, భూమిలేని నిరుపేదలను వదిలేయడం ఇందిరమ్మ రాజ్యానికి మచ్చ తెచ్చే విధంగా వ్యవహరిస్తున్నారని మండల ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికే అర్హత లేని వాళ్ళకి కేటాయించారని మండలంలోని లక్ష్మీపురం గ్రామంలో కార్యదర్శికి ఫిర్యాదు చేశారు.పట్టణంలో తమ అనుచరులకు ఇల్లు రాలేదని ఇరువర్గాలు ఘర్షణ పడిన సంఘటన చోటుచేసుకుంది.
ఇదే పరిస్థితి చిన్నకోరుకొండి గ్రామంలో ఏర్పడింది. దాదాపు 35 మంది ఇల్లు లేని నిరుపేదలున్నారని ఒక్కో ఇంట్లో మూడు కుటుంబాలు జీవిస్తున్నారని,గత వర్షాలకు గోడలు కూలి నిరాశ్రయ స్థితిలో ప్రభుత్వ పాఠశాలలో తలదాచుకున్న కుటుంబాలను సైతం వదిలేశారని, చిన్నపాటి వర్షాలకు ఇల్లు కురుస్తూ చిన్న పిల్లలతో అవస్థలు పడుతున్న మాపై దయ చూపడం లేదని ఆవేదన చెందుతున్న దీనస్థితి గ్రామంలో కనబడుతుంది.
ఒక్క చిన్నకోరుకొండి గ్రామమే కాకుండా మండలంలో దాదాపు ఇదే పరిస్థితి ఉందని అంటున్నారు.ప్రజా ప్రభుత్వంగా ప్రజా పాలన కొనసాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం క్షేత్రస్థాయిలో పునః పరిశీలించి నిజమైన లబ్ధిదారుల జాబితాను ఎంపిక తయారు చేసే బాధ్యతను అప్పగిస్తే వచ్చిన అధికారులు తూతూ మంత్రంగా సర్వే చేసి వెళుతున్నారని తెలిపారు. గ్రామస్థాయిలో జరుగుతున్న వ్యవహార శైలిని ఉన్నత అధికారులు, స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రులు, ప్రజా ప్రతినిధులు పరిశీలించి నిజమైన లబ్ధిదారులకు ఇండ్లు కేటాయించి ఆదుకోవాలని కోరుతున్నారు. ఇదేనా..? ఇందిరమ్మ రాజ్యమంటే అంటూ తమ బాధను ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.