calender_icon.png 3 August, 2025 | 3:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేద మహిళలే లక్ష్యం.. పసికందులతో వ్యాపారం

03-08-2025 12:43:16 AM

  1. గ్రామీణ ప్రాంతాల్లోని పేద మహిళల నుంచి పసికందుల కొనుగోళ్లు 
  2. సంతానం లేని దంపతుల ఆశే ఆసరాగా దందా 
  3. సరోగసీ ద్వారా పుట్టినట్టు నమ్మించి లక్షల్లో మోసం 
  4. ‘సృష్టి’ కేసులో విస్తూపోయే నిజాలు 
  5. కీలక నిందితులు కల్యాణి, సంతోషిలను కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్న పోలీసులు 

హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 2 (విజయక్రాంతి): తెలుగు రాష్ట్రాలను కుదిపే స్తున్న సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నా యి. సంతానం కోసం వచ్చిన దంపతుల బలహీనతను ఆసరాగా చేసుకొని, ప్రధాన నింది తురాలు డాక్టర్ నమ్రత భారీ మోసానికి పాల్పడినట్టు పోలీసుల విచారణలో తేటతెల్లమవుతోంది.

గ్రామీణ ప్రాంతాల్లోని నిరు పేద మహిళలే లక్ష్యంగా మెడికల్ క్యాంపులు నిర్వహించి, అధిక డబ్బును ఆశచూపి వారి నుంచి పసికందులను కొనుగోలు చేసినట్టు పోలీసులు గుర్తించారు. అనంతరం ఆ శిశువులను, సరోగసీ ద్వారా జన్మించారని చెప్పి సంతానం లేని జంటలకు లక్షల్లో విక్రయిం చి భారీగా ఆర్జించినట్టు నిర్ధారించారు. ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రతను రెండో రోజు విచారించగా అనేక అక్రమాలు బయటపడ్డాయి.

ఆమె కేవలం హైదరాబాద్‌లోనే కాకుండా విజయవాడ, వైజాగ్‌లలో నూ బ్రాంచీలు నడుపుతూ ఈ దందాను విస్తరించినట్టు తెలిసింది. ఈ చైల్డ్ ట్రాఫికింగ్ నెట్‌వర్క్‌లో పలువురు ఏఎన్‌ఎంలు, ఆశావర్కర్లు కూడా నమ్రతకు సహకరించినట్టు పోలీసులు ఆధారాలు సేకరించారు. పేద మహిళలను ట్రాప్ చేయడంలో, పసికందుల క్రయవిక్రయాలు జరపడంలో ఈ నెట్‌వర్క్ కీలకంగా వ్యవహరించినట్టు భావిస్తున్నారు.

ఈ కేసులో ఏ3గా ఉన్న సృష్టి వైజాగ్ బ్రాంచీ మేనేజర్ కల్యాణి, ఏ6గాగా ఉన్న ధనశ్రీ సంతోషి (అస్సాం) పాత్ర అత్యంత కీలకమని పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ సివిల్ కోర్టు అనుమతితో వీరిద్దర్ని పోలీసులు ఐదు రోజుల కస్టడీలోకి తీసుకున్నారు.

శనివారం సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం, వారిని ఉత్తర మండల డీసీపీ కార్యాలయానికి తరలించి విచారణ ప్రారంభించారు. సరోగసి వ్యవహారం, శిశువుల కొనుగోలు, ఏజెంట్ల వివరాలపై వీరిని లోతుగా ప్రశ్నించనున్నారు.

నోరు మెదపని నమ్రత..

మరోవైపు, రెండోరోజు విచారణలో నమ్రత పొంతనలేని సమాధానాలు చెప్పినట్టు సమాచారం. తన తప్పేమీ లేదని, ఓ ఆర్మీ అధికారి కక్షపూరితంగా తనపై తప్పుడు ఆరోపణలు చేసి ఈ కేసులో ఇరికించారని ఆమె వాదిస్తోంది. అయితే, ఐవీఎఫ్, శిశువుల కొనుగోలు, అనుమతులు లేకుండా ఆసుపత్రి నిర్వహణ, చైల్డ్ ట్రాఫికింగ్‌పై పోలీసులు అడిగిన సూటి ప్రశ్నలకు మాత్రం ఆమె నోరు మెదపడం లేదని తెలిసింది.

సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ ద్వారా ఓ జంట బిడ్డను పొందగా, ఆ చిన్నారి క్యాన్సర్ బారినపడింది. దీంతో వైద్యం కోసం డీఎన్‌ఏ పరీక్ష నిర్వహించగా అసలు బండారం బయటపడింది. ఆ శిశువుకు, తమకు డీఎన్‌ఏ సరిపోలకపోవడంతో తాము మోసపోయామని గ్రహించిన సదరు దంపతులు పోలీసు లను ఆశ్రయించారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నమ్రతను అరెస్ట్ చేసి విచారించగా, ఈ సంచలన నిజాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.