ప్రతిభకు పేదరికం అడ్డు కాదు
ఇంటెలిజెన్స్ ఎస్పీ దండుగుల రమేష్
వెంకటాపూర్, జూలై 1 (విజయక్రాంతి): ప్రతిభను సాధించడంలో పేదరికం ఎప్పుడూ అడ్డంకి కాదని, చదువుపై తపన, సంకల్పం ఉంటే ఏ లక్ష్యాన్నైనా చేరుకోవచ్చని ఇంటెలిజెన్స్ ఎస్పీ దండుగుల రమేష్ అన్నారు.
బుధవారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వ్యక్తిత్వ వికాసం, మార్గదర్శకత్వం, పరీక్షల భయాన్ని అధిగమించే అంశాలపై నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. విద్యార్థులు కష్టపడి, ఇష్టపడి చదివితే విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని, కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఎప్పుడూ వెనుకాడవద్దని, ప్రయత్నం చేసిన వారికే విజయం దక్కుతుందని అన్నారు.
ప్రతి విద్యార్థి జీవితంలో ఒక స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుని, నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. మన తలరాతను మార్చగల శక్తి విద్యకు మాత్రమే ఉందని, లక్ష్యసాధన కోసం నిరంతరం కృషి చేయాలని పిలుపునిచ్చారు. విద్యార్థులను ప్రశ్నలు అడిగి సరైన సమాధానాలు చెప్పిన వారికి బహుమతులు అందజేస్తూ వారిలో ఉత్సాహాన్ని నింపారు. అనంతరం స్థానిక ఎస్‌ఐ చల్లా రాజు తో కలిసి పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు రాధిక, ఎస్త్స్ర రాజు, ఉపాధ్యాయులు బాబురావు, ఫిరోజ్, కిరణ్, అంబేద్కర్, కిషోర్ బాబు, వేణు, మక్బూల్, సంధ్యారాణి, జ్యోత్స్న, విద్యార్థులు పాల్గొన్నారు.






