calender_icon.png 19 December, 2025 | 5:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యుత్ సంక్షోభం

19-12-2025 01:09:35 AM

  1. నష్టాల ఊబిలో విద్యుదుత్పత్తి, విద్యుత్ పంపిణీ సంస్థలు 
  2. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ తీసుకున్న నిర్మాణాత్మక చర్యలు శూన్యం 
  3. దయనీయంగా ఉద్యోగుల జీత భత్యాలు 
  4. ఆధారాలున్నా పార్టీ మారలేదనడం విచారకరం
  5. ఢిల్లీ మీడియా సమావేశంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

హైదరాబాద్, డిసెంబర్ 18 (విజయక్రాంతి) : వ్యవస్థల మనుగడకు ఎంతో కీలకమైన విద్యుత్ రంగం తెలంగాణలో తీవ్ర సంక్షోభంలో ఉందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. గురువారం ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో కిషన్‌రెడ్డి మాట్లాడారు. పవర్ జనరేషన్, పవర్ డిస్ట్రిబ్యూషన్ సమర్థవంతంగా నిర్వహించాల్సిన బాధ్యత రాష్ర్ట ప్రభుత్వాలపై ఉందన్నారు. 11 ఏళ్లు గా మోదీ ప్రభుత్వం విద్యుదుత్పత్తి, విద్యుత్ సరఫరాపై సమర్థవంతంగా పనిచేస్తోందని తెలిపారు.

దేశంలో విద్యుదు త్పత్తిలో 74 శాతం బొగ్గు రంగం ద్వారా జరుగుతోందని, ఎంత డిమాండ్ పెరిగినా దానికి తగ్గట్లుగా బొగ్గు అందజేసేం దుకు మా మంత్రిత్వ శాఖ సిద్ధంగా ఉం దని ప్రకటించారు. తెలంగాణ, ఏపీలో.. పారిశ్రామిక, గృహ, వ్యవసాయ అవసరాలకు విద్యుత్ కొరత ఉందని పేర్కొ న్నారు. వన్ నేషన్, వన్ గ్రిడ్ పేరుతో.. దేశంలో ఎక్కడ విద్యుదుత్పత్తి జరిగినా.. ఇతర రాష్ట్రాలకు దీన్ని సరఫరా చేసే విధంగా పనిచేస్తున్నామని తెలిపారు.

తెలంగాణలోనూ విద్యుత్ సరఫరాకు అవసరమైన సహాయాన్ని కేంద్రం అందిస్తోందని తెలిపారు. రాష్ర్టంలో 5,15,000 ఇండ్లకు ప్రధానమంత్రి సౌభాగ్యయోజన కింద కరెంట్ అందిస్తున్నామని, ఉజ్వల పథకం కింద గృహ వినియోగదారులకు 28 లక్షల ఎల్‌ఈడీ బల్బులను కేంద్రం అందించినట్టు వివరించారు.

ఎన్టీపీసీ ఆధ్వర్యంలో తెలంగా ణలో 4,000 మెగావాట్ల విద్యుదుత్పత్తికి కేంద్రం నిర్ణయం తీసుకుందని, మొ దటి విడతలు 1,600 మెగావాట్ల విద్యుదుత్పత్తికి రూ. 11 వేల కోట్లను కేంద్రం వెచ్చించిందని వెల్లడించారు. మరో 2,400 మెగావాట్లకు పనులు జరుగుతున్నాయని చెప్పారు. ప్రహ్లాద్ జోషితో మాట్లాడి పీఎం కుసుమ్ కింద..  తెలంగాణకు 20 లక్షల పంప్ సెట్లను అందిం చామని, మొదటిసారి 100 మెగావాట్ల ఫ్లోటింగ్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేశామని తెలిపారు.

176 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్లు కూడా త్వరలోనే పూర్తిచేస్తున్నామని, తెలంగాణ రాష్ట్రానికి అన్నిరకాలుగా విద్యుత్ సంబంధిత అంశంలో సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. కానీ తెలంగాణలో విద్యుదుత్పత్తి, విద్యుత్ పంపిణీ సంస్థలు నష్టాల ఊబిలో కూరుకుపోవడం దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ర్ట ఆర్థిక పరిస్థితి, విద్యుత్ సంస్థల దయనీయ పరిస్థితి గురించి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శ్వేతపత్రాన్ని విడుదలచేసి వివిధ విద్యుత్ విభాగాలు, డిస్కంలు చెల్లించాల్సిన అప్పు రూ. 30వేల కోట్లకు పైగా ఉందని చెప్పినట్టు గుర్తుచేశారు. కానీ ఒక్క సింగరేణి సంస్థకే దాదాపు రూ. 47 వేల కోట్లు విద్యు త్ సంస్థలు బాకీ పడ్డాయని పేర్కొన్నారు. 

అప్పుల ప్రగతి అద్భుతం..

రాష్ర్టంలో విద్యుత్ సంస్థలు ఆర్థికంగా సాధించిన అప్పుల ప్రగతి అద్భుతంగా ఉందని ఎద్దేవా చేశారు. తెలంగాణలో లక్ష మెగావాట్ల పవర్ డిమాండ్ పెరుగుతోందని ప్రభుత్వం చెబుతున్నా దానికి తగ్గట్లుగా విద్యుదుత్పత్తి, విద్యుత్ పంపిణీకి అవసరమైన మౌలిక వసతులు రాష్ర్టంలో లేవని తెలిపారు. పదేళ్లపాటు బీఆర్‌ఎస్ ప్రభుత్వం, రెండేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి నిర్మాణాత్మకమైన చర్యలు తీసుకోలేదని విమర్శించారు.

అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడులు పెట్టాలని గ్లోబల్ సమ్మిట్‌లో సీఎం రేవంత్ రెడ్డి అన్నారని, కానీ ఈ దిశగా రాష్ర్టప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. బడ్జెట్‌లో రూ. 21 వేల కోట్లను మాత్రమే విద్యుత్ రంగానికి కేటాయించారని, అందులోనూ మెజారిటీ ఉచితప థకాలకు కేటాయించారని, పాత బకాయిల సంగతేంటో.. తెలియడం లేదన్నారు.  మరో డిస్కం సంస్థ పేరుతో  మరిన్ని అప్పులు తీసుకోవడమే తప్ప ఇందులో చిత్తశుద్ధి లేదని విమర్శించారు.

జెన్కోకు ఉన్న రూ. 26 వేల కోట్ల బకాయిలను, మరో రూ.9వేల కోట్ల ప్రతిపాదిత రుణాలను కొత్త డిస్కంకు బదిలీ చేయాలని రాష్ర్ట ప్రభుత్వం ప్రయత్నిస్తోందని స్పష్టం చేశారు. పవర్ జనరేషన్ విషయంలో ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించడంలేదని, కార్యాచరణ లేదని విమర్శించారు.

రామగుండం, మక్తల్, పాల్వంచల్లో మూడు పవర్ ప్లాంట్లు పెడతామని రాష్ర్ట ప్రభుత్వం చెబుతోందని, ఎన్టీపీసీ ద్వారా విద్యుదుత్పత్తి చేస్తే రాష్ర్ట ప్రభుత్వంపై ఆర్థిక భారం పడదన్నారు. కేవలం పవర్ పర్చేస్ అగ్రిమెంట్ చేసుకుంటే చాలు అని, కానీ ఎందుకు రాష్ర్ట ప్రభుత్వం ఇలా ఆలోచిస్తోందో అర్థం కావడం లేదన్నారు. 

ఆధారాలున్నా పార్టీ మారలేదనడం విచారకరం.. 

టీవీల ముందు, ప్రజల ముందు కొందరు ఎమ్మెల్యేలు పార్టీలు మారినట్లు స్పష్టం చేశారని, కాంగ్రెస్‌కు అనుకూలంగా ప్రచారం చేసినట్లు ఆధారాలున్నా.. వారు పార్టీ మారలేదని స్పీకర్ చెప్పడం విచారకరమన్నారు. నాడు కాంగ్రెస్ గుర్తుపై గెలిచిన వారికి బీఆర్‌ఎస్ మంత్రి పదవులు ఇచ్చిందని, ప్రస్తుతం కాంగ్రెస్ కూడా అదే దారిలో నడుస్తోందని కిషన్‌రెడ్డి విమర్శించారు. ఈ రెండు పార్టీలు చట్టాన్ని అపహాస్యం చేస్తున్నాయని మండిపడ్డారు.

రాజ్యాంగాన్ని చేతులో పట్టుకుని తిరగడం కాదని, తెలంగాణలో ఏ విధంగా రాజ్యాంగాన్ని అవమానం చేస్తున్నారో చూసి చర్యలు తీసుకోవాలని రాహుల్‌గాంధీకి సూచించారు. స్పీకర్ తన నిర్ణయంపై పునరాలోచన చేసి ఫిరాయింపుల చట్టం ప్రకారం స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.