20 April, 2026 | 10:56 AM

యాసంగి సాగుకు సన్నద్ధం

09-12-2024 12:10 AM
  1. కరీంనగర్ జిల్లాలో 3.04 లక్షల ఎకరాల్లో సాగు అంచనా
  2. వ్యవసాయ పనుల్లో బిజీగా రైతులు
  3. ప్రధాన పంటలుగా వరి, పత్తి, మొక్కజొన్న

కరీంనగర్, డిసెంబరు 8 (విజయక్రాం తి): కరీంనగర్ జిల్లాలో యాసంగి సాగుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే దుక్కిదున్ని సాగు కోసం నారుమళ్లను సిద్ధం చేసుకున్నారు. ఖరీఫ్‌లో ప్రధాన పంటలుగా వరి, పత్తిని సాగు చేస్తుండగా, యాసంగిలో ప్రధాన పంటలుగా పత్తి, మొక్కజొన్న పంటలను సాగు చేస్తారు.

ఎస్సారెస్పీ ఆయకట్టు కింద, బావులు, బోర్లలో పుష్కలంగా నీళ్లు ఉండటంతో నారుమడులు సిద్ధం చేసుకున్నారు. బావుల్లో నీళ్లు ఉన్న రైతులు పొలా లు దున్ని నాట్లకు సిద్ధం చేసుకుంటున్నారు. మెట్టప్రాంత రైతులు మొక్కజొన్న విత్తనాలు వేసుకుంటున్నారు. కొంతమంది ఆరుతడి పంటలవైపు మొగ్గు చూపుతున్నారు.

ఈ ఏడాది వానాకాలం సీజన్‌లో భారీ వర్షాలు కురియగా, చెరువులు, కుంటలు నిండుకుండల్లా మారడంతో వాటి ఆయకట్టు కింద రైతులు వరిని సాగు చేశారు. దిగుబడి కూడా అనుకున్న విధంగా వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం సన్నరకానికి బోనస్ ప్రకటించడంతో ఎస్సారెస్పీ ఆయకట్టు కింద రైతులు ఎక్కువగా వరిసాగు చేశారు.

యాసంగిలో కూడా రైతులు వరి సాగు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. మెట్ట ప్రాంత రైతులు మొక్కజొన్న పంట వేసేందుకు సిద్ధమవుతున్నారు. వానాకాలం సీజన్ నుంచి క్వింటా ల్‌కు 500 రూపాయల బోనస్ ఇస్తామని ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రకటించింది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సన్నరకం వడ్లకే బోనస్ ఇస్తామని ప్రభుత్వం నిర్ణయించడంతో జిల్లా రైతులు నిరాశకు గురవుతున్నారు.

ఈ మేర కు దొడ్డురకం వడ్ల నుంచి సన్నరకం సాగుకు మారుతారా? బోనస్ వదులుకుంటారా? అనే సందిగ్ధం నెలకొంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం తెల్ల రేషన్‌కార్డు దారులతోపాటు హాస్టళ్లకు, మధ్యా హ్న భోజనానికి సన్నబియ్యం ఇవ్వాలనే నిర్ణయానికి అనుగుణంగానే డిమాండ్‌కు తగ్గ సన్నబియ్యం అందుబాటులో లేకపోవడం తో ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసే పరిస్థితి ఉంది.

దీనిని అధిగమించేందుకు స్థానిక రైతులు సన్నాలు సాగువైపు మళ్లేందుకు 500 రూపాయల బోనస్ ఇస్తున్నట్లు ప్రకటించారు. జిల్లాలో భూగర్భ జలాలు పెరగడం ద్వారా కాలేశ్వరం జలాలతో వరి సాగు పెరుగుతూ వచ్చింది. ఈ పరిస్థితుల్లో సన్నరకం వడ్ల వైపు మొగ్గుచూపుతారా అనేది చర్చనీయాంశంగా మారింది.

2,65,500 ఎకరాల్లో వరి 

జిల్లా వ్యవసాయ శాఖ  మొత్తం 3,04,655 ఎకరాల్లో సాగు లక్ష్యంగా నిర్ణయించింది. ఇందులో అత్యధికంగా వరి 2,65,500 ఎకరాలు, మొక్కజొన్న 26,000 ఎకరాలు, పత్తి 20 ఎకరాలు, పెసర 80 ఎకరాలు, కందులు ఐదు ఎకరాలు, శనగ 50 ఎకరా లు, వేరుశనగ 500 ఎకరాలు, పొద్దుతిరుగుడు 380 ఎకరాలు సాగు చేసేందుకు జిల్లా వ్యవసాయ శాఖ ప్రణాళిక రూపొందించింది. మొత్తం 42,416 క్వింటాళ్ల యూరి యా, 5,907 క్వింటాళ్ల డీఏపీ, 22,339 కాంప్లెక్స్ ఎరువులు, 5,907 క్వింటాళ్ల ఎం వోపీ ఎరువులు అవసరమని వ్యవసాయశాఖ గుర్తించి ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించింది.