07-10-2025 12:00:00 AM
కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్
మహబూబాబాద్, అక్టోబర్ 6 (విజయక్రాంతి): 2025 26 ఖరీఫ్ సీజన్ లో పండించిన ధాన్యం కొనుగోలుకు అధికారులు సన్నద్ధం కావాలని మహబూబాబాద్ కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఖరీఫ్ సీజన్లో ధాన్యం కొనుగోళ్ల కేంద్రాల ఏర్పాటు, నిర్వహణ కోసం అదనపు కలెక్టర్ కే.అనిల్ కుమార్, సంబంధిత అధికారులతో కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రానున్న ఖరీఫ్ సీజన్లో ముందస్తు ప్రణాళిక ప్రకారం జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల కేంద్రాల ఏర్పాటు, నిర్వహణ సంబంధిత అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో కలిసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకో వాలని సూచించారు.
ఐకెపి, గిరిజన కార్పొరేషన్, ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీలు, తదితర సంస్థల ద్వారా 237 కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందనీ, అందుకోసం జిల్లా స్థాయి దాన్యం కొనుగోళ్ల కేంద్రాల కమిటీ ద్వారా ప్రభుత్వం సూచించిన ప్రకారం ముందుకు వెళ్లడం జరుగుతుందన్నారు. దాన్యం వివరాలు, కొనుగోలు, రవాణా, ప్యాడి క్లీనర్స్, వేయింగ్ మిషన్స్, మ్యాచ్చర్స్, మిషన్లు, తదితర అంశాలపై క్షేత్రస్థాయి అధికారులందరికీ శిక్షణ తరగతులు నిర్వహించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో డి ఆర్ డి ఓ పీడీ మధుసూదన రాజు, డిసిఓ వెంకటేశ్వర్లు, డి.ఎస్.ఓ ప్రేమ్ కుమార్, డిఏఓ విజయనిర్మల, డిఎం సివిల్ సప్లై క్రిష్ణవేణి, మార్కెటింగ్ అధికారి వెంకటేశ్వర్లు, ఎల్డిఎం, ఆర్టీవో సాయిచరణ్, దేవ్, రమేష్ పాల్గొన్నారు.
విద్యాలయాల్లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
మహబూబాబాద్, అక్టోబర్ 6 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ముత్యాలమ్మ గూడెం, కంబాలపల్లి విద్యాలయాల్లో సోమవారం తనిఖీలు నిర్వహించారు. ముత్యాలమ్మ గూడెం బాలికల ఆశ్రమ పాఠశాల, అంగన్వాడీ కేంద్రం , మండల ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేశారు. అలాగే కంబాలపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్ పాఠశాలల్లోని కిచెన్ షెడ్, డైనింగ్ హాల్, మరుగుదొడ్లు, లైబ్రరీ తరగతి గదులను, పరిసరాలను పరిశీలించారు.
విద్యార్థుల యొక్కవివరాలను, వారి యొక్క అభ్యసన సామర్ధ్యాలను పరిశీలించడానికి వివిధ పాఠ్యాంశాలపై ప్రశ్నలు అడిగి, విద్యార్థులతో ముచ్చటించి విద్యాబోధనపై అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు షెడ్యూల్ ప్రకారం, డిజిటల్ తరగతులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా విద్యాబోధన చేయాలని సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన బోజనంతో పాటు, మంచి విద్యను అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. క్రమం తప్పకుండా పిల్లలకు షెడ్యూల్ ప్రకారం వైద్య పరీక్షలు నిర్వహించాలని, వారి యొక్క మానసిక, ఆరోగ్య స్థితిగతులను నిత్యం గమనిస్తూ ఉండాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ నిత్యం సానిటేషన్ చేయాలన్నారు.