ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు క్రాంతి మృతి
గుండెపోటుతో ఆకస్మిక మరణం పలువురి సంతాపం
ములకలపల్లి, మార్చి 31 (విజయక్రాంతి): ములకలపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పోతుగంటి బ్రహ్మం(క్రాంతి) ఆకస్మిక మృతిపై పలువురు సంతాపం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన స్వగ్రామమైన తిమ్మంపేటలో భౌతిక కాయాన్ని సందర్శించి పలువురు నివాళులు అర్పించారు. పోతుగంటి క్రాంతి సోమవారం సాయంత్రం గుండెపోటుకు గురై హఠాన్మరణం చెందారు.
క్రాంతి కొంతకాలం పాటు అప్పటి సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ యువజన విభాగంలో పనిచేసి తర్వాత మావోయిస్టు పార్టీలో చేరి దళ కమాండర్ స్థాయికి ఎదిగి కొంతకాలం పాటు అజ్ఞాత జీవితం గడిపారు. చత్తీస్గడ్ రాష్ట్రంలో ఆ తర్వాత అశ్వారావుపేట ప్రాంతంలో మావోయిస్టు కార్యకలాపాలను నిర్వహించారు. కుక్కునూరు పోలీస్ స్టేషన్ పేల్చివేత, ఆ మండలంలో కాంగ్రెస్ నాయకుడు రామిరెడ్డిని హత్య చేసిన సంఘటనలో పాల్గొన్నారు.
కుక్కునూరు, వేలేరుపాడు పోలీస్ స్టేషన్లో ఇతనిపై కేసులు నమోదు అయ్యాయి. 2007లో క్రాంతిని పోలీసులు అరెస్టు చేశారు. బెయిల్ పై బయటికి వచ్చిన అతను అజ్ఞాత జీవితానికి స్వస్తి పలికి సాధారణ జీవితం గడిపారు. ప్రజా సమస్యలపై ఉన్న మక్కువతో పత్రికా రంగంలో చేరి ములకలపల్లి దిశా విలేకరిగా పనిచేస్తూ ప్రస్తుతం ప్రెస్ క్లబ్ మండల అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.
క్రాంతి భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించిన వారిలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ నాయకులు నూప భాస్కర్, పోతుగంటి లక్ష్మణ్, అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, మాజీ జడ్పిటిసి సభ్యులు బత్తుల అంజి, కాంగ్రెస్ మండల అధ్యక్షులు తాండ్ర ప్రభాకర్ రావు, సిపిఐ నాయకులు నరాటి ప్రసాద్, సిపిఎం మండల కార్యదర్శి ముదిగొండ రాంబాబు, జిల్లాలోని పలు మండలాలకు చెందిన జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాలకు చెందిన నాయకులు పలువురు ప్రజాప్రతినిధులు,మాజీ ప్రజా ప్రతినిధులు ఉన్నారు.




