కలర్ జిరాక్స్‌తో నకిలీ నోట్లు ప్రింటింగ్!
- బిజినేపల్లి కేంద్రంగా నిందితుల ఎత్తుగడ
- ఏపీ, తెలంగాణకు చెందిన ఏడుగురి ముఠా అరెస్ట్
నాగర్‌కర్నూల్, ఆగస్టు 6 (విజయక్రాంతి): బిజినేపల్లి పరిధిలో నకిలీ కరెన్సీ నోట్ల తయారీ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. డీఎస్పీ బుర్రి శ్రీనివాసులు గురువారం మీడియాకు వివరాలు వెల్లడించారు. ఈ నెల 1న మంగనూరు గ్రామంలోని కనకదుర్గ వైన్ షాపులో ఓ వ్యక్తి నకిలీ రూ.500 నోటుతో బీరు కొన్నాడు. క్యాషియర్‌కు అనుమానం వచ్చి బిజినేపల్లి పోలీస్‌లకు ఫిర్యాదు చేయగా వారు దర్యాప్తు చేపట్టారు.
గురువారం మంగనూరు గ్రామానికి చెందిన లోళ్ల కుమారమూర్తి ఇంటిపై నాగర్‌కర్నూల్ సీఐ అలోక్‌రెడ్డి ఆధ్వర్యంలో దాడులు నిర్వహించగా, ఏడుగురు నిందితులు నకిలీ రూ.500 నోట్లను తయారు చేస్తూ పట్టుబడ్డారు. ప్రధాన నిందితుడు కొరిడిండి నాగరాజు ఆర్థిక ఇబ్బందుల కారణంగా సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఇతర నిందితులతో కలిసినట్టు గుర్తించారు. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన వ్యక్తుల సహాయంతో అసలు కరెన్సీకి బదులుగా నాలుగు రెట్లు నకిలీ కరెన్సీ అందించేలా ఒప్పందం చేసుకున్నట్లు బయటపడింది.
అదే గ్రామానికి చెందిన నవీన్ గౌడ్ ద్వారా నకిలీ నోట్లు నాగర్‌కర్నూల్ జిల్లాకు చేరగా, కుమారమూర్తి వాటిని మంగనూరు గ్రామంలోని బార్లు, కిరాణా దుకాణాలు, పెట్రోల్ బంకులు, వైన్ షాపుల్లో చలామణి చేసినట్లు విచారణలో తేలింది. ఏడుగురు నిందితులను అరెస్టు చేయగా, ఒకరు పరారీలో ఉన్నాడు. రూ.68 వేల విలువైన నకిలీ రూ.500 నోట్లు, 7 సెల్‌ఫోన్లు, జిరాక్స్ మెషిన్, కట్టింగ్ మెషిన్, కాటన్ లినెన్ పేపర్లు సీజ్ చేశారు.






