6 August, 2026 | 6:41 PM

ఆచార్య జయశంకర్ ఆశయాల సాధనే నిజమైన నివాళి : డీసీసీ అధ్యక్షులు బట్టు కరుణాకర్

06-08-2026 05:03 PM

భూపాలపల్లి టౌన్,(విజయక్రాంతి): ఆచార్య జయశంకర్ ఆశయాల సాధనే వారికి మనం ఇచ్చే నిజమైన నివాళి అని కాంగ్రెస్ పార్టీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు బట్టు కరుణాకర్ అన్నారు. తెలంగాణ సిద్ధాంతకర్త, మహామేధావి ఆచార్య కొత్తపల్లి జయశంకర్ 92వ జయంతి వేడుకలు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించగా కరుణాకర్ ముఖ్య అతిధిగా హాజరై జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా కరుణాకర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనకు సిద్ధాంతపరమైన దిశానిర్దేశం చేసి ఉద్యమానికి మేధోబలాన్ని అందించిన మహనీయుడు ఆచార్య జయశంకర్ అని అని కొనియాడారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం, స్వాభిమానం, సామాజిక న్యాయం కోసం ఆయన జీవితాంతం చేసిన కృషి, త్యాగాలు చిరస్మరణీయమని అన్నారు. తెలంగాణ ఉద్యమ చరిత్రను, జయశంకర్ ఆశయాలను భావితరాలకు చేరవేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. యువత ఆయన జీవితం నుంచి స్ఫూర్తి పొంది సమాజాభివృద్ధి, ప్రజాసేవ కోసం ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఆచార్య జయశంకర్ ఆశయ సాధనకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని కరుణాకర్ స్పష్టం చేశారు.