03-08-2025 12:34:46 AM
హైదరాబాద్,ఆగస్టు 2(విజయక్రాంతి): రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఏపీ మద్యం కుంభకోణంలో సిట్ మరో ముందడుగు వేసింది. స్కాంకు సంబంధించిన ఆధారాలను సేకరించడంలో పురోగతి సాధించింది. సిట్ చేతికి కీలక ఆధారం లభించింది. ఏపీ లిక్కర్ స్కాంలో విచారణలో భాగంగా హైదరాబాద్‌లో ఉన్న ఓ ఫాంహౌజ్‌లో రూ. 11 కోట్లను ఏపీ సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే.
డబ్బులన్నీ అట్టపెట్టెల్లో పేర్చేందుకు వీలుగా ఉంచారు.ఈ కేసులో ఇప్పటికే పలువురిని సిట్ అరెస్ట్ చేసింది. కేసు విచారణలో భాగంగా చెవిరెడ్డి అనుచరుడు, కేసులో ఏ-34 గా ఉన్న వెంకటేశ్ వాట్సప్ నుంచి వీడియోలను రిట్రీవ్ చేయించింది. ఈ క్రమంలో ఎన్నికలకు ముందు నగదును పంపిణీ చేసేందుకు వీలుగా ఆ డబ్బులను రహస్య ప్రదేశంలో దాచిన వీడియో సిట్‌కు దొరికింది.
ఈ వీడియోలో ఎన్నికల్లో పంచడానికి సిద్ధంగా ఉన్న నోట్ల కట్టలను పట్టుకుని చెవిరెడ్డి అనుచరుడు వెంకటేశ్ నాయుడు కనిపించాడు. అలాగే డబ్బులను లెక్కపెడుతున్న దృశ్యాలు కనిపించాయి. ఇప్పటివరకు లిక్కర్ కేసులో తమకు సంబంధం లేదని చెబుతున్న చెవిరెడ్డికి ఈ వీడియోలో తన అనుచరుడు వెంకటేశ్ నాయుడు కనపబడడం పెద్ద దెబ్బగా భావిస్తున్నారు.
దీంతో కేసులో చెవిరెడ్డి అడ్డంగా బుక్ అయినట్లేనని న్యాయనిపుణులు పేర్కొంటున్నారు. కేసు దర్యాప్తులోఈ వీడియో కీలకంగా మారనుంది. సిట్‌కు లభించిన ఈ వీడియో ఏపీలో సంచలనం సృష్టిస్తోంది. ఈ మేరకు నోట్ల కట్టల వీడియోలను సిట్ బయటపెట్టింది.