30-07-2024 01:15:01 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 29 (విజయక్రాంతి): గ్రేటర్ హైదరాబాద్ మున్సి పల్ కార్పొరేషన్ పరిధిలో ఆస్తి పన్ను చెల్లింపులు పారదర్శకంగా నిర్వహించేందుకు, జీహెచ్‌ఎంసీ ఆదాయం మరింత పెంచుకోవడానికి చేపడుతున్న జియో గ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (జీఐఎస్) సర్వే మరింత వేగం పుంజు కుంటుంది. దీనిలో భాగంగా ఇప్పటికే డ్రోన్ సర్వే ప్రారంభం కాగా, తాజాగా డోర్ టు డోర్ సర్వే పనులు షురూ కానున్నాయి. ఈ మేరకు మంగళవారం నుంచి జీహెచ్‌ఎంసీ పరిధిలోని పలు ప్రాంతాల్లో డోర్ టు డోర్ సర్వే ప్రారంభం కానుంది. ఈ సర్వేలో నివాసంలోని ఎలక్ట్రికల్, వాటర్ బిల్లు, ప్రాపర్టీ ట్యాక్స్ వివరా లతో పాటు సమీపంలోని యూనిట్ల వివరాలు అన్నింటినీ సేకరించనున్నారు. దీంతో ప్రాపర్టీ ట్యాక్స్ ఎగవేతదారుల నుంచి రావాల్సిన ఆదాయాన్ని రాబట్టుకోవడానికి జీహెచ్‌ఎంసీ ప్రత్యేక చర్యలు చేపట్టనుంది.
ప్రతి ఇంటిని పక్కాగా లెక్కించేందుకు
జీహెచ్‌ఎంసీ పరిధిలోని 19 లక్షల నివాసాల నుంచి ప్రతి ఏడాది వేల కోట్ల ఆదాయం లభిస్తోంది. 2023 రూ. 1914.87 కోట్లు ప్రాపర్టీ ట్యాక్స్ రూపంలో బల్దియాకు లభించింది. వాస్తవానికి గ్రేటర్‌లో 19 లక్షల కంటే అధికంగానే నివాసా లు ఉండొచ్చని అధికారుల భావన. చాలా వరకు అపార్ట్‌మెంట్ నిర్మాణాలలో జీ ప్లస్ 2, జీ ప్లస్ 3 వరకు మాత్రమే అనుమతులు పొందుతూ ఆపై 4, 5 అంతస్తులను నిర్మిస్తున్నారనే విషయం తెలిసిందే. వీరంతా అధికారికంగా పొందిన అనుమతుల మేరకు మాత్రమే ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లిస్తున్నారు. వీటన్నింటికీ చెక్ పెట్టేందుకు నగరంలోని ప్రతి ఇంటిని పక్కా గా లెక్కించేందుకు జీఐఎస్ సర్వే నడుస్తోంది. ఇప్ప టికే డ్రోన్ మ్యాపింగ్ పూర్తయిన ఉప్పల్, హయత్‌నగర్, హైదర్‌నగర్, కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, మియాపూర్, చందానగర్ ప్రాంతాల్లో ఈ నెల 30 నుంచి జీఐఎస్ సర్వే చేపట్టే ఏజెన్సీ, జీహెచ్‌ఎంసీ సిబ్బంది కలిసి ఇంటింటి సర్వే చేపట్టనున్నారు.
ప్రతి యూనిట్‌కు లెక్క..
ఇప్పటికే డ్రోన్ సర్వే, జీఐఎస్ మ్యాపింగ్ పూర్తయిన ప్రాంతాల్లోని ఇళ్లను, ఇతర ఆస్తులను ఈ నెల 30 నుంచి లెక్కకట్టనున్నారు. ఎన్ని కుటుంబాలున్న బహుళ అంతస్తుల భవనంలో అయినా ప్రతి ఇంటి వివరాలను ఈ డోర్ టు డోర్ (గ్రౌండ్) సర్వే ద్వారా సేకరించనున్నారు. బిల్డింగ్ పర్మిషన్ పత్రాలు, ఆక్యూపెన్సీ డీటెయిల్స్, లేటెస్ట్ ప్రాపర్టీ ట్యాక్స్ రశీదు, వాటర్ బిల్లు, ఎలక్ట్రిసిటీ బిల్లు, యజమానుల గుర్తింపు కార్డు, ట్రేడ్ లైసెన్స్ నంబర్, సమీపంలోని రోడ్లు, పార్కులు, పబ్లిక్ యుటిలిటీ సెంటర్స్ తదితరాలు అన్నింటిని కలిపి ఒక యూనిట్‌గా వివరాలు నమోదు చేయనున్నారు. ఈ మొత్తం సర్వే పూర్తయితే రానున్న రోజుల్లో జీహెచ్ ఎంసీ ప్రాపర్టీ ట్యాక్స్ అదనంగా మరో రూ. 1000 నుంచి రూ. 1500 కోట్లు పెరిగే అవకాశాలు ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు.