07-09-2025 12:47:28 AM
ఈర్ల రాజు, కాలనీ వాసులు ఎమ్మార్వోకి వినతిపత్రం అందజేత
అమీన్ పూర్,(విజయక్రాంతి): అమీన్ పూర్ మండలంలోని కిష్టారెడ్డిపేట్ గ్రామ పరిధి, రెయిన్బో కాలనీ సర్వే నంబర్లు 208, 210లో గల 1.06 ఎకరాల ప్రభుత్వ భూమిని కొందరు భూకబ్జాదారులు అక్రమ పద్ధతుల్లో స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించారు. శనివారం కొందరు వ్యక్తులు ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి, ప్రభుత్వ భూమిని తాము కొనుగోలు చేశామని చెబుతూ సర్వే నంబర్ 201లో 10 గుంటల భూమి కొనుగోలు చేశామని చెప్పి, వాస్తవానికి 208, 210 నంబర్ల ప్రభుత్వ భూమిలోకి ప్రవేశించి బోరు వేయడానికి ప్రయత్నించారు.
ఈ విషయాన్ని గుర్తించిన రెయిన్బో కాలనీ వాసులు వెంటనే అడ్డుకుని, అమీన్ పూర్ బిజెపి మండల అధ్యక్షుడు ఈర్ల రాజు ముదిరాజ్ కు సమాచారం అందించారు. ఆయన తక్షణమే స్పందించి తహసీల్దార్‌తో మాట్లాడి, అక్కడికి వచ్చిన బోర్ మిషన్‌ను నిలిపివేయించి వెనక్కి పంపించారు.
ఈ సందర్భంగా ఈర్ల రాజు ముదిరాజ్ మాట్లాడుతూ... ప్రభుత్వ భూమిని అక్రమంగా కబ్జాలు చేసి ధోరణిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా తహసీల్దార్ ని కలిసి వినతి పత్రం అందజేశామన్నారు. కిష్టారెడ్డిపేట్ రెయిన్బో మెడోస్ కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వ భూమిని రక్షించడంలో తనతో పాటు పాత్ర పోషించారు ఇప్పటికైనా అధికారులు జోక్యం చేసుకొని ఈ ప్రభుత్వ భూమిని రక్షించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం చేపడతామని ఈర్ల రాజు ముదిరాజ్ తెలిపారు.