calender_icon.png 7 September, 2025 | 11:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

న్యాక్‌గ్రేడ్‌లో వర్సిటీల వెనుకబాటు

07-09-2025 12:50:27 AM

  1. రాష్ట్రంలో మూడు వర్సిటీలకు సీ గ్రేడే
  2. రెండింటికి అసలు న్యాక్ గుర్తింపే లేదు
  3. నిధుల లేమి, ఫ్యాకల్టీ కొరతతో దుస్థితి
  4. జాతీయస్థాయిలో పోటీ పడలేక చతికిల

హైదరాబాద్, సెప్టెంబర్ 6 (విజయక్రాంతి): పరిశోధనలు, సరికొత్త ఆవిష్కరణల కు నిలయాలుగా ఉండాల్సిన విశ్వవిద్యాలయాలు ప్రమాణాలు అందుకోలేక వెనుక డుతున్నాయి. నామమాత్రపు విద్యాబోధనతో మమ అనిపిస్తున్నాయి. ప్రపంచంతో పోటీ పడాల్సిన మన విశ్వవిద్యాలయాలు కనీసం జాతీయ స్థాయిలోనూ పోటీలో నిలవలేకపోతున్నాయి. రాష్ట్రంలోని పలు యూనివర్సిటీలు విద్యాప్రమాణాలు పాటించడంలో అంతంతమాత్రంగానే ఉంటున్నా యి.

ఫలితంగా నేషనల్ అసెస్‌మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (న్యాక్) గ్రేడుల్లో వెనుకబడుతున్నాయి. ఉత్తమ గ్రేడ్‌లను పొం దడం లేదు. యూనివర్సిటీల్లోని మెరుగైన విద్యాప్రమాణాలు, మౌలిక సదుపాయాలను ఆధారంగా చేసుకొని న్యాక్ వివిధ గ్రే డ్లు ఇస్తోంది. ఈ గ్రేడ్‌ల ఆధారంగానే ఆయా వర్సిటీలకు గుర్తింపు ఉంటుంది.

ఉత్తమమైన యూనివర్సిటీ, విద్యాసంస్థ ఏదో తెలుసుకోవచ్చు. న్యాక్ ఇచ్చే గ్రేడ్‌ను బట్టే అది మంచి యూనివర్సిటీనా.. కాదా, అందులో ఏ విధమైన విద్యాప్రమాణాలు పాటిస్తున్నారో తెలిసిపోతోంది. తద్వారానే ప్రవేశాలు పొందేందుకు విద్యార్థులు ఆసక్తి చూపిస్తారు. 

గ్రేడ్‌లో వెనుకబాటు..

విద్యా, రాష్ట్రాభివృద్ధికి విశ్వవిద్యాలయాలు వేదికలుగా, దిక్సూచీలుగా ఉండా ల్సింది పోయి నిత్యం సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. మంచి విద్య అందిం చినప్పుడే విద్యార్థులు రాణించగలుగుతారు. దేశంలో ఉండే ఉన్నత విద్యాసంస్థల నాణ్యతను అంచనా వేయడానికి న్యాక్ గ్రేడ్లను ఇస్తోంది. అత్యుత్తమ గ్రేడ్ ఏ++ నుంచి అత్యల్ప గ్రేడ్ డీ వరకు కేటాయిస్తుంది. విశ్వవిద్యాలయాలకు ఏ++, ఏ+, ఏ, బీ++, బీ+, బీ, సీ, డీ గ్రేడ్లు కేటాయిస్తోంది.

రాష్ట్రంలోని పదకొండు యూనివర్సిటీలు న్యాక్ ఉత్తమ గ్రేడ్‌ను పొందలేకపోతున్నాయి.  ఏ ఒక్క యూనివర్సిటీకి అత్యుత్తమ గ్రేడ్‌లేదు. అయితే మూడు విశ్వవిద్యాలయాలు మా త్రం ఏ+ గ్రేడ్‌ను కలిగి ఉండటం కాస్త ఊరటనిచ్చే అంశం. ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, జేఎన్టీయూహెచ్ యూనివర్సిటీలు మాత్రమే ఏ+ గ్రేడ్‌ను కలిగిఉన్నాయి. శాతవాహన, తెలంగాణ యూని వర్సిటీలకు గుర్తింపే లేదు. ఇక మిగతా వర్సిటీలకు ఏ, బీ, సీ గ్రేడ్లే ఉన్నాయి.

బీఆర్ అంబే ద్కర్ ఓపెన్ యూనివర్సిటీ మహాత్మా గాంధీ యూనివర్సిటీ పాలమూరు యూనివర్సిటీొోబీ, జేఎన్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీొోసీ, సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీ బాసర ఆర్జీయూకేటీ యూనివర్సిటీ గ్రేడ్‌లను కలిగిఉన్నాయి. అంతేకాదు ఇటీవల ప్రకటించిన ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకింగ్‌లోనూ రాష్ట్రంలోని విశ్వవి ద్యాలయాలు మంచి ర్యాంకులను సాధించలేకపోయాయి.

తీవ్రమైన నిధులు, ఫ్యాకల్టీ కొరత

రాష్ట్రంలోని యూనివర్సిటీలకు నిధుల కొరత, టీచింగ్ ఫ్యాకల్టీ కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఇవి ఉంటేగానీ వర్సిటీలు అభివృద్ధి చెందవు. ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం డెవలప్‌మెంట్ గ్రాంట్స్ కింద రూ.500 కోట్ల నిధులను ఆయా వర్సిటీలకు కేటాయించింది. ఉస్మానియా, మహిళా వర్సిటీలకు రూ.100 కోట్లు చొప్పున.. కాకతీయ వర్సిటీకి రూ.50 కోట్లు, మహాత్మాగాంధీ, పాలమూరు, శాతవాహన, తెలంగాణ, తెలుగు వర్సిటీలకు రూ.35 కోట్ల చొప్పున కేటాయించగా, అంబేద్కర్ ఓపెన్ వర్సిటీకి రూ.25 కోట్లు కేటాయించారు.

అయితే ఈ నిధులను ఇంత వరకూ విడుదల చేయలేదని అధికారికవర్గాలు పేర్కొంటున్నాయి. దీంతోపాటు యూనివర్సిటీల్లో టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ కొరత వెంటాడుతోంది. మంజూరైన పోస్టుల్లో దాదాపు 70 నుంచి 80 శాతం వరకు ఖాళీలు ఉన్నాయి. కాంట్రాక్ట్, గెస్ట్ ఫ్యాకల్టీలతోనే నెట్టుకొస్తున్నారు.

కొత్త కోర్సులకు అనుగుణంగా ఫ్యాకల్టీలు ఉండటం లేదు. దీంతో నాణ్యమైన విద్య, పరిశోధనలు సాగడంలేదు. ఫలితంగా న్యాక్ గ్రేడ్‌పై ప్రభావం పడుతోంది. యూనివర్సిటీలతో త్వరలోనే ఉన్నతవిద్యామండలి ఓ సమావేశాన్ని నిర్వహించనున్నది. ఇందులో న్యాక్ అంశంపై కూడా వర్సిటీలకు పలు సూచనలు చేయనుంది.

గైడ్‌లైన్స్ కోసం ఎదురుచూస్తున్నాం: శాతవాహన యూనివర్సిటీ వీసీ ఉమేశ్ కుమార్ 

సెంట్రల్ న్యాక్ గైడ్‌లైన్స్ కోసం ఎదురుచూస్తున్నాం. వచ్చిన వెంటనే న్యాక్‌కు దరఖాస్తు చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నాం. ఈసారి ఇంజినీరింగ్, లా, ఫార్మసీ కాలేజీలను తీసుకొచ్చాం. నూతన భవనాలు నిర్మించాం. పరిశోధనలపై దృష్టిసారిస్తున్నాం. ప్రతి యూనివర్సిటీకి న్యాక్ గ్రేడ్ తప్పనిసరి. మంచి గ్రేడింగ్ సాధించేందుకు కృషి చేస్తున్నాం. నవంబర్ రెండోవారంలో వర్సిటీ కాన్వకేషన్ నిర్వహిస్తాం. దీనికి గవర్నర్ వస్తున్నారు.