01-12-2024 03:34:07 AM
సంగారెడ్డి ఇరిగేషన్ ఆఫీస్ ఎదుట అమీన్‌పూర్ బాధితుల ఆందోళన
పటాన్‌చెరు, నవంబర్ 30: సంగారెడ్డి జిల్లా ఇరిగేషన్ ఆఫీస్ ఎదుట అమీన్‌పూర్ పెద్ద చెరువు ముంపు బాధితులు శనివారం ఆందోళన చేపట్టారు. పెద్ద చెరువు ముంపు నుంచి తమ ఇండ్లను కాపాడాలని ఇరిగేషన్ ఎస్‌ఈకి వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా ముంపు బాధితుల జేఏసీ చైర్మన్ చిరునామా సత్యనారాయణ మాట్లాడుతూ తమ ఇండ్లను కాపాడాలని జేఏసీ ఆధ్వర్యంలో 21 రోజులుగా పెద్దచెరువు కట్టపై నిరసన దీక్షలు చేపట్టామని, రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్ శాఖల అధికారులకు సమస్య పరిష్కారం కోసం వినతిపత్రాలు అందజేశామని తెలిపారు.
93.1 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పెద్ద చెరువు అలుగు, తూము కాలువలను మూసేయడంతో 465 ఎకరాలకు నీటితో విస్తరించిందన్నారు. తక్షణమే చెరువు అలుగు, తూము కాలువులను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఇటీవల అమీన్‌పూర్‌కు వచ్చిన హైడ్రా కమిషన ర్ రంగనాథ్‌ను కలిసి సమస్యను విన్నవించామని చెప్పారు. ఇరిగేషన్ అధికారులు మాత్రం తమతప్పును కప్పిపుచ్చుకోడానికి హైడ్రా కమిషనర్‌ను తప్పుదోవ పట్టిస్తున్నారని వాపోయారు. కార్యక్రమంలో సంజయ్ కుమార్, పుండరీకాక్షశర్మ, రాంబాబు, సురే శ్, పూర్ణచంద్రరావు పాల్గొన్నారు.