01-12-2024 03:29:18 AM
పటాన్‌చెరు, నవంబర్ 30: నిబంధనలు పాటించకుండా విచ్చలవిడిగా కాలుష్యాన్ని వెదజల్లుతున్న రెండు పరిశ్రమలపై పీసీబీ కొరడా ఝుళిపించింది. జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామికవాడలోని లీఫా ర్మా పరిశ్రమ, గుమ్మడిదల మండలం బొంతపల్లి పారిశ్రామికవాడలోని గ్రాన్యూల్స్ పరిశ్రమలకు రాష్ట్ర పీసీబీ మెంబర్ సెక్రటరీ రవి జరిమానా, బ్యాంక్ గ్యారెంటీలు విధించినట్లు పీసీబీ జోనల్ ఈఈ కుమార్ పాఠక్ శనివారం తెలిపారు.
ఇటీవల కురిసిన వర్షాలను ఆసరాగా చేసుకొని లీఫార్మా పరిశ్రమ వర్షం వరద మాటున కాలుష్య వ్యర్థాలను ఎనిమిది పైపుల ద్వారా బయటకు వదులుతుండగా గ్రామస్తులు గమనించి పీసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన పీసీబీ అధికారులు నివేదికను ఎంఎస్‌కు అందజేశారు. దీంతో ఎంఎస్ లీఫార్మా పరిశ్రమకు రూ.8 లక్షల జరిమానా, రూ.24 లక్షల బ్యాంకు గ్యారెంటీలను విధించారు.
అలాగే నిబంధనలను గాలికొదిలేసి కాలుష్యాన్ని బయటకు వదులుతున్న గ్రాన్యూల్స్ పరిశ్రమకు రూ.8 లక్షల జరిమానా, రూ.24 లక్షల బ్యాంక్ గ్యారెంటీలను పీసీబీ, ఎంఎస్ విధించారని ఈఈ తెలిపారు.