30-12-2025 04:42:28 PM
మున్సిపల్ కార్యాలయం ముందు చెత్త వేసి నిరసన వ్యక్తం
చిట్యాల,(విజయక్రాంతి): చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డు శివనేనిగూడెంలో నిర్వహిస్తున్న డంపింగ్ యార్డ్ ను వెంటనే అక్కడినుండి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఆ వార్డుకు చెందిన అఖిలపక్ష నాయకులు మంగళవారం స్థానిక మున్సిపల్ కార్యాలయం ముందు చెత్త పోసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ గత ఎన్నో రోజులుగా శివనేనిగూడెంలో నిర్వహిస్తున్న డంపింగ్ యార్డ్ వల్ల వచ్చే దుర్వాసన, కలుషితమైన పొగ, బూడిద, ఇతర కాలుష్యకారక వస్తువుల వల్ల స్థానికంగా ప్రజలు నివాసం ఉండలేని పరిస్థితి ఉందని వృద్ధులు, చిన్న పిల్లలు శ్వాసకోశ వ్యాధులకు గురై ఇబ్బందులు పడే పరిస్థితి ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
డంపింగ్ యార్డ్ ను అక్కడి నుండి తొలగించాలని జిల్లా కలెక్టర్, ఆర్డిఓ, మున్సిపల్ కమిషనర్, తాసిల్దార్ లకు వినతి పత్రం అందించినప్పటికీ వారెవరు స్పందించడం లేదని ఆరోపించారు. డంపింగ్ యార్డ్ ను వెంటనే అక్కడి నుండి తీసివేయకపోతే అక్కడ ఉన్న చెత్త మొత్తం మున్సిపల్ కార్యాలయం ముందు పోసి తగలబెడతామని వారు హెచ్చరించారు.
ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ దండు శ్రీను మాట్లాడుతూ ఈ విషయాన్ని నల్గొండ ఆర్డీవో దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని రెండు మూడు రోజుల్లో ఆయన డంపింగ్ యార్డ్ ను పరిశీలించి పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోనున్నారని అప్పటివరకు ఓపిక పట్టాలని చెప్పడంతో వారు శాంతించారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు రుద్రవరం లింగస్వామి, రుద్రవరం సునీల్, బొబ్బలి సుధాకర్ రెడ్డి, రుద్రవరం యాదయ్య, రుద్రవరం నరేష్, నాగిళ్ల స్వామి, గ్రామస్తులు పాల్గొన్నారు.