16-10-2025 06:27:36 PM
నిర్మల్ (విజయక్రాంతి): బ్యాంకులు ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్ తెలిపారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో బ్యాంకు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించు వివిధ రుణాలపై వివిధ శాఖల అధికారులతో కలిసి బ్యాంకర్లు ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలన్నారు. కొద్ది రోజులుగా బ్యాంకుల్లో పెండింగ్ లో ఉన్న ఉపసంహరించుకొని నిధుల వివరాలను గుర్తించి, వారి సంబంధీకులకు, బ్యాంకు నియమాలు పాటిస్తూ, ఆ నగదును అందించాలని అన్నారు.
వెనుకబడిన తరగతుల ప్రజలకు, మహిళా స్వయం సహాయక సంఘాలకు, రైతులకు, వీధి వ్యాపారస్తులకు, విద్యార్థులకు అందించు రుణాల మంజూరులో ఆలస్యం చేయకూడదన్నారు. వివిధ రకాల రుణాలకు అర్హులైన దరఖాస్తుదారులకు సంబంధిత రుణాలను అందజేయాలన్నారు. సైబర్ నేరాల పట్ల బ్యాంకు సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పించాలని వారు. విస్తృత అవగాహన ద్వారానే సైబర్ నేరాలను నియంత్రించవచ్చునని తెలిపారు. ఇప్పటివరకు ప్రజలకు బ్యాంకుల ద్వారా అందజేసిన రుణాల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. బ్యాంకులకు వచ్చే ప్రజలందరికీ మెరుగైన సేవలు అందించాలని అన్నారు. ఈ సమావేశంలో ఆర్డీవో రత్నకళ్యాణి, జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ రామ్ గోపాల్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శంకర్, ఆర్బీఐ ఏజీఎం యశ్వంత్, ఎస్బిఐ ఆర్ఎం రామచంద్ర రావు, జిల్లా అధికారులు, బ్యాంకర్లు, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.