calender_icon.png 16 October, 2025 | 11:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీలను మరోసారి మోసం చేసిన కాంగ్రెస్

16-10-2025 08:38:26 PM

నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి..

నర్సంపేట (విజయక్రాంతి): రేవంత్ రెడ్ది సర్కార్ ఇచ్చిన జిఓ 9ను సుప్రీం కొట్టి వేసిన పరిస్థితిలు చూస్తుంటే కాంగ్రెస్ పార్టీకి బీసీలపై ఉన్న ప్రేమ కపట ప్రేమేనని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. గురువారం పత్రికలకు ఇచ్చిన సమాచారం మేరకు ఆయన మాట్లాడుతూ... అసెంబ్లీ ఎన్నికలకు ముందు కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ నేడు ఆ హామీని నిలబెట్టుకోలేక బీసీలను మోసం చేస్తుందన్నారు. బీసీలకు రాజకీయ, విద్య, ఉద్యోగ అవకాశాలలో 42 శాతం రిజర్వేషన్ అమలుపైన కాంగ్రెస్ పార్టీకి  చిత్తశుద్ధి లేదని, రేవంత్ సర్కార్ కపట ప్రేమను బీసీలపైన చూపిస్తూ 42 శాతం రిజర్వేషన్ అందకుండా రాజ్యాంగ విరుద్ధంగా జీవోలను, ఆర్డినెన్స్ లను, చట్టాలను చేస్తూ బీసీలను నయవంచనకు గురిచేస్తుందని విమర్శించారు.

హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో 9 పైన స్టే విధిస్తే అదే జీవో సుప్రీంకోర్టులో చెల్లదని తెలిసి సుప్రీంకోర్టును ఆశ్రయించడం ఎంత సమంజసమని ప్రశ్నించారు. బీహార్ రాష్ట్రంలో జరిగే ఎన్నికల కోసం హైకోర్టు, సుప్రీం కోర్టులలో చేల్లని జీవోలను తీసుకువచ్చి రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నిజస్వరూపాన్ని తెలంగాణ బీసీ సమాజం గమనిస్తున్నదన్నారు. దేశంలో ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న రాహుల్ గాంధీ ,కాంగ్రెస్ పార్టీ పార్లమెంటులో బిసి రిజర్వేషన్ చట్టం తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయడం లేదని,ఒక్క రోజుకూడా పార్లమెంటును స్తంభింపచేయలేదన్నారు. రాష్ట్రంలో మాత్రం స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం హడావుడి చేస్తున్నట్టు నటిస్తున్నారని అన్నారు.

రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలో ఉన్న రెండు జాతీయ పార్టీలు కాంగ్రెస్ మరియు బీజేపీ కుట్రల వలనే నేడు బీసీలకు రిజర్వేషన్ ఫలాలు అందడం లేదన్నారు.కాంగ్రెస్ పార్టీ బీసీలకు చేస్తున్న మోసాన్ని ఎండగడుతూ,ఈనెల 18న బీసీ సంఘాల ప్రతినిధులు ఇచ్చిన బంద్ కు బిఆర్ఎస్ పార్టీ మద్దతు తెలియజేస్తున్నదని అన్నారు. నియోజకవర్గంలోని బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఈ  బంద్ కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొని 42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలుకు కాంగ్రెస్ పార్టీ పైన పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.