calender_icon.png 16 October, 2025 | 11:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హాస్టళ్లలో కొత్త మెనూ ఆవిష్కరణ

16-10-2025 08:28:42 PM

జిల్లా కలెక్టర్ బి.యం సంతోష్

గద్వాల: 2025-26 విద్యా సంవత్సరానికి ఎస్‌.సి., ఎస్‌.టి., బి.సి. ప్రీ-మెట్రిక్ హాస్టళ్లలో కొత్త మెనూను గురువారం ఐడీఓసీ తమ ఛాంబర్ నందు వాల్ పోస్టర్ ను జిల్లా కలెక్టర్ బి.యం సంతోష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ఎస్‌.సి., ఎస్‌.టి., బి.సి. ప్రీ-మెట్రిక్ హాస్టళ్లలో 2025–26 విద్యా సంవత్సరానికి కొత్త,పోషకాహార మెనూ అమలులోకి వచ్చిందని తెలిపారు. మంచి ఆహారం,మంచి ఆరోగ్యం,మంచి విద్య – ఈ మూడు ఒకదానికొకటి విడదీయరాని అంశాలు అని,విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి నాణ్యమైన ఆహారం అందించడం ప్రభుత్వ అత్యంత ప్రాధాన్య లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

ప్రతి విద్యార్థి శారీరక, మానసిక అభివృద్ధికి తోడ్పడే విధంగా నిత్య ఆహారంలో పోషక పదార్థాలు ఉండేలా కొత్త మెనూను రూపొందించామని తెలిపారు. పిల్లల శ్రేయస్సు దృష్ట్యా ఆహారంలో నాణ్యతా ప్రమాణాలు కచ్చితంగా పాటించాలని, వంటశాలల్లో పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు ఆదేశించారు. హాస్టళ్లలో వండే ప్రతి భోజనం తాజా పదార్థాలతో సిద్ధం చేయాలని, విద్యార్థులకు భోజనం సమయానికి అందించాలని అధికారులకు సూచించారు. హాస్టల్ వంటగదులు ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉండేలా పర్యవేక్షణ జరగాలని,నీటి వనరులు, నిల్వ ప్రదేశాలు శుభ్రంగా ఉంచాలని ఆయన అన్నారు.విద్యార్థుల ఆరోగ్యంపై నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని,ఆహారంలో ఎటువంటి నిర్లక్ష్యం చోటుచేసుకోకూడదని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిసి సంక్షేమ అధికారి అక్బర్ పాషా,ఈ.డి ఎస్సీ కార్పొరేషన్ నుషిత,హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లు,సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.