17-10-2025 12:06:34 AM
సింగరేణి మహోన్నతికి తోడ్పాటు అందించిన రిటైర్డ్ ఉద్యోగులను ఆ సంస్థ గాలికి వదిలేసింది. ఉచిత వైద్య సౌకర్యాలు కల్పించాలని సింగరేణి యాజమాన్యాన్ని పదే పదే కోరుతున్నా ఫలితం మాత్రం శూన్యం. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో 41:59 ఆధీనంలో నడుస్తున్న సింగరేణి సంస్థ వేతన ఒప్పందాలు చట్టరీత్యా సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రమోష న్ పాలసీలతో పాటు అనేక సౌకర్యాలు కల్పిస్తున్నది.
అయితే ఒకప్పుడు అందులోనే పనిచేసి రిటైర్ అయిన విశ్రాంత ఉద్యోగులను మాత్రం పట్టించుకోవడం లేదు. ఉచిత వైద్య సదుపాయం కల్పించడానికి కోల్ ఇండియా నియమ నిబంధనలు అడ్డువస్తున్నాయని సింగరేణి యాజమాన్యం పేర్కొంటుంది. ఇప్పటికే ఈ విషయాన్ని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తో పాటు కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి దృష్టికి తీసుకెళ్లగా.. వారు సానుకూలంగా స్పందించారు.
కానీ మంత్రుల మాటలను పెడ చెవిన పెట్టినట్లుగా కనిపిస్తున్న యాజమాన్యం వైద్య సదుపాయాలు కల్పించడంలో నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తున్నది. ప్రస్తుతం సింగరేణి ఆసుపత్రుల్లో ఔట్ పేషెంట్, సీపీఆర్‌ఎంఎస్ ద్వారా ఎనిమిది లక్షల వైద్య సౌకర్యాలు కల్పిస్తున్నారు. అచేతన వ్యవస్థలో ఉన్న మాకు దిన దినం పెరుగుతున్న వైద్య ఖర్చులు సరిపడక జీవిత చివరి రోజుల్లో ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నాం. రిటైర్డ్ ఉద్యోగులకు ఉచి తం గా మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వానికి మరోసా రి విజ్ఞప్తి చేస్తున్నాం.
రాంచందర్, హైదరాబాద్