calender_icon.png 18 October, 2025 | 8:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చరమాంకం!

17-10-2025 12:09:30 AM

దేశంలో నక్సలిజం చరమాంకానికి చేరుకున్నట్లుగా అనిపిస్తున్నది. ఒకప్పుడు సగం రాష్ట్రాలకు విస్తరించి ప్రభుత్వాలను కుదిపేసిన నక్సలైట్ గ్రూపులు ఇప్పుడు క్రమంగా బలహీనపడుతూ తమ ఉనికిని కోల్పోతున్నాయి. దీనికి కారణాలు అనేకం. మొదట భూస్వాముల దోపిడీ వ్యతిరేక ఉద్యమంగా పురుడు పోసుకున్న నక్సలిజం క్రమంగా బలహీనపడుతూ వచ్చింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పోరాడేందుకు తగినంత ఆయుధ సంపత్తి లేకపోవడం, మావోయిస్టులకు ఆవాస కేంద్రాలైన చత్తీస్‌గఢ్, బీహార్, జార్ఖండ్ లాంటి రాష్ట్రాల్లో సాయుధ దళాల కట్టుదిట్టమైన భద్రత పెరగడం, 2026 వరకు దేశంలో నక్సలిజం పూర్తిగా తుడిచిపెట్టేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకోవడం మావోయిస్టు దళాలకు ఇ బ్బందిగా మారింది.

ఆయుధాలను వదిలేసి జనజీవన స్రవంతిలో కలిస్తే సమాజంలో ఉన్నతంగా బతికే అవకాశం కల్పిస్తామని కేంద్రం హామీనివ్వడంతో క్రమంగా మావోయిస్టులు లొంగుబాటుకే మొ గ్గుచూపుతున్నారు. భద్రతా దళాలను పెద్ద ఎత్తున మోహరించి ఛత్తీస్‌గఢ్ లో ‘ఆపరేషన్ కగార్’ను ప్రారంభించినప్పటి నుంచి మావోయిస్టులకు ప్రాణసంకటమైంది. తాజాగా మావోయిస్టు పార్టీకి దశాబ్దాల పాటు కీలక సేవలందించిన మల్లోజుల వేణుగోపాల్‌రావు 60 మంది మావోయిస్టులతో కలిసి బుధవారం మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఎదుట లొంగిపోయారు.

రెండు రోజుల వ్యవధిలోనే ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా, కాం కేర్, కొండగావ్ జిల్లాలు కలిపి మొత్తంగా 300 మందికి పైగా మావోయిస్టులు సరెండర్ అయ్యారు. 1967లో పశ్చిమ బెంగాల్‌లో నక్సల్బరీ గ్రా మంలో నక్సలిజం పుట్టుకొచ్చింది. భూస్వాముల దోపిడీకి వ్యతిరేకంగా రై తులు, గిరిజనులు చేపట్టిన ఉద్యమం క్రమంగా కమ్యూనిస్టు సిద్ధాంతాల ప్రభావంతో సాయుధ పోరాటంగా మారింది. 1980, 90వ దశకంలో న క్సల్స్ ప్రాబల్యం బలపడింది.

ఆంధ్రప్రదేశ్‌లో కొండపల్లి సీతారామయ్య ‘పీపుల్స్ వార్ గ్రూప్’ను స్థాపించడం..ఇదే సమయంలో బీహార్, జార్ఖండ్‌లో మావోయిస్టు కమ్యూనిస్టు కేంద్రం ప్రభావం పెరిగి దేశవ్యాప్తంగా విస్తరించింది. అయితే కాలక్రమేణా మావోయిస్టులు తమ సిద్ధాంతాలకు విరుద్ధంగా హింస మార్గాన్ని ఎంచుకోవడం ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లేలా చేసింది. దీనికి తోడు నక్సల్ ప్రభావిత జిల్లాల్లోనూ అభివృద్ధి కార్యక్రమా లు, మౌలిక సదుపాయాల పెంపు, ఉపాధి అవకాశాల పెరుగుదల వల్ల నక్సలైట్ ఉద్యమం ప్రభావం కోల్పోతూ వచ్చింది.

మావోయిస్టుల అణచివేత వ్యూహాల్లో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో సీ ఆర్పీఎఫ్, కోబ్రా ఫోర్స్, ఇతర ప్రత్యేక దళాలను నక్సల్ ప్రభావిత ప్రాం తాల్లో వినియోగించడం పెరిగిపోయింది. కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం ఏప్రిల్ 2024 నాటికి దేశవ్యాప్తంగా మావోయిస్టు ప్రభావిత జిల్లాల సం ఖ్య 38కి పడిపోయింది. భారత రాజ్యాంగంపై తమ విశ్వాసాన్ని ప్రకటిస్తూ హింసను త్యజించాలనే మావోయిస్టుల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు.

2026 మార్చి 31 నాటికి దేశంలో నక్సలిజాన్ని సమూలంగా నిర్మూలించేందుకు తాము కట్టుబడి ఉన్నామ న్నారు. మావోయిస్టు కార్యకలాపాలకు కేంద్రంగా ఉన్న అబూజ్‌మడ్, ఉత్తర బస్తర్‌లు విముక్తి పొందాయని, త్వరలో దక్షిణ బ స్తర్‌లోనూ నక్సలిజాన్ని పూర్తిగా తుడిచేస్తామని ఘంటాపథంగా చెబుతున్నారు.