23-09-2025 06:47:17 PM
రూ.700 కోట్లతో రోడ్లు, మౌలిక సదుపాయాలు
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యే జిఎస్సార్
రేగొండ/భూపాలపల్లి,(విజయక్రాంతి): గిరిజన ప్రాంతాల అభివృద్ధికి రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, వికలాంగుల, వృద్ధుల సంక్షేమ సాధికారికత శాఖల మంత్రి అడ్లురి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. మంగళవారం భూపాలపల్లి మండలం దూదేకుల పల్లి,గొల్ల బుద్ధారం గ్రామాల్లో రూ.4.30 కోట్లతో బీటీ రోడ్ల అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమానికి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
రాష్ట్రంలోని అన్ని గిరిజన గూడేలు, లంబాడి తండాల్లో ప్రజలకు అవసరమైన విద్య, వైద్యం, విద్యుత్, రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థల అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని అందులో భాగంగానే రూ. 700 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులను చేపట్టినట్టు మంత్రి తెలిపారు. గత ప్రభుత్వం చేసిన తప్పులను సరి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామన్నారు. మంత్రి హోదాలో భూపాలపల్లి నియోజకవర్గంలో శంకుస్థాపన కార్యక్రమానికి రావడం సంతోషంగా ఉందన్నారు.
భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ భూపాలపల్లి నియోజకవర్గానికి మరిన్ని నిధులు ఇచ్చి అభివృద్ధికి సహకరించాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను ఎమ్మెల్యే కోరారు. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ హయాంలోనే మారుమూల గ్రామాలు, తండాలు, గూడేలు,పల్లెలు ఎంతో అభివృద్ధి చెందాయని ప్రజల ప్రతి అవసరాన్ని తీర్చడమే ధ్యేయంగా ముందుకెళ్తున్నామని ఎమ్మెల్యే అన్నారు.