calender_icon.png 30 December, 2025 | 4:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి

30-12-2025 02:11:54 AM

జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి 

కుమ్రంబీం ఆసిఫాబాద్, డిసెంబర్ 29 (విజయక్రాంతి): ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారి అన్నారు. సోమవారం  కలెక్టరేట్ లో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎం. డేవిడ్ తో కలిసి అర్జీదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. జిల్లా కేంద్రం లోని దస్నాపూర్ కు చెందిన పొన్న సునీత తనకు వితంతు పెన్షన్ ఇప్పించాలని కోరుతూ అర్జీ సమర్పించారు.

రెబ్బెన మండలం గోలేటి గ్రామానికి చెందిన జాదవ్ రోహిదాస్ తమ గ్రామంలో ప్రతిపాదిత ఓపెన్ కాస్ట్ నిర్వాసితుల జాబితాలో తన పేరు లేనందున విచారణ జరిపించి న్యాయం చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. రెబ్బెన మండలం గంగాపూర్ గ్రామానికి చెందిన దుర్గం లక్ష్మి తాను సాగు చేస్తున్న ప్రభుత్వ భూమిని పట్టా చేసి తనకు పాస్ పుస్తకం మంజూరు చేయాలని కోరుతూ అర్జీ సమర్పించారు. జిల్లా కేంద్రం లోని జనకాపూర్ కు చెందిన పడాల తిరుపతి తన ఇల్లు భారీ వర్షాలకు కూలిపోయినందున నష్టపరిహారం మంజూరు చేయాలని కోరుతూ అర్జీ సమర్పించారు. 

కౌటాల మండలం సాండ్ గాం గ్రామానికి చెందిన రైతులు తాము పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. కాగజ్ నగర్ మండలం కోసిని గ్రామానికి చెందిన పుల్లపు అనసూయ తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరుతూ అర్జీ సమర్పించారు. కెరమెరి మండలం ఝరి గ్రామానికి చెందిన షేక్ దస్తగిర్ తాను కొనుగోలు చేసిన భూమిని సాదాబైనమా ప్రకారం పట్టా మార్పిడి చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. కాగజ్ నగర్ మండలం అంకుశాపూర్ గ్రామానికి చెందిన సెండె ఒమాజీ, తన సహోదరులకు చెందిన పట్టా భూమి కొలతలు చేయడానికి రుసుము చెల్లించడం జరిగిందని, వెంటనే కొలతలు జరిపించాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. 

ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించేందుకు అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికా రులు తదితరులు పాల్గొన్నారు.