24 March, 2026 | 2:48 AM

ప్రజావాణి దరఖాస్తులు త్వరితగతిన పరిష్కరించాలి

24-03-2026 01:14 AM

కలెక్టర్ ప్రతిమా సింగ్ 

మెదక్, మార్చి 23(విజయక్రాంతి): సమస్య పరిష్కారం కోరుతూ ప్రజలు ప్రజావాణిలో అందచేసిన దరఖాస్తుల పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలని  కలెక్టర్ ప్రతి మాసింగ్ తెలిపారు. సోమవారం ఐడిఓసి కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో కలిసి ప్రజావాణి నిర్వహించి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుండి మొత్తం 73 దరఖాస్తులు స్వీకరించి తక్షణ చర్యలకు సంబంధిత శాఖల అధికారులకు ఎండార్స్మెంట్ చేసినట్లు తెలిపారు. అట్టి దరఖాస్తులను అధికారులు జాప్యం చేయక పరిష్కరించాలని ఆదేశించారు.

ప్రజావాణిలో వచ్చిన అన్ని దరఖాస్తులు వచ్చే సోమవారం నిర్వహించనున్న ప్రజావాణి నాటికి పూర్తిగా పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆమె స్పష్టం చేశారు. సమస్యల పరిష్కారం కోసం ప్రజలు సుదూర ప్రాంతాల నుంచి కార్యాలయానికి వచ్చి దరఖాస్తులు ఇస్తున్నారని, అందువల్ల అధికారులు దరఖాస్తులు పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని తెలిపారు. దరఖాస్తుల పరిష్కారంలో పర్యవేక్షణ లోపిస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్,డిఆర్డిఓ పి డి శ్రీనివాసరావు, అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.