24 March, 2026 | 4:35 AM

జనాభా కంటే రేషన్ లబ్ధిదారులే ఎక్కువ!

24-03-2026 01:13 AM
  1. 85 శాతం మంది పేదలేనా?

సంపన్న జిల్లాల్లోనూ 98 శాతం కార్డులు

ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సంచలన నివేదిక

సమగ్ర విచారణ జరపాలని సీఎంకు పద్మనాభరెడ్డి లేఖ

హైదరాబాద్ సిటీ బ్యూరో, మార్చి 23 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఉచిత బియ్యం పంపిణీ తీరుపై ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ విస్తుపోయే నిజాలను వెలుగులోకి తెచ్చింది. రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డుల పంపిణీ శాస్త్రీయంగా లేదని, అర్హతలతో సంబంధం లే కుండా ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం కా ర్డులు జారీ చేస్తున్నారని ఆరోపించింది. ఈ మేరకు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు ఎం పద్మనాభరెడ్డి ముఖ్యమంత్రి రేవం త్‌రెడ్డికి సుదీర్ఘ లేఖ రాశారు.

వివిధ సర్వేలు, ప్రభుత్వ గణాంకాలను విశ్లేషించిన ఫోరం.. రాష్ట్ర జనాభా కంటే ఉచిత బియ్యం పొందుతున్న వారే ఎక్కువగా ఉన్నారని సంచలన విషయాన్ని బయటపెట్టింది. కేంద్ర ప్రభు త్వం తెలంగాణలో 1.2 కోట్ల మంది.. 54.67 లక్షల కార్డులు కి సరిపడా ఉచిత బియ్యాన్ని అందిస్తోంది. ఇది రాష్ట్రంలోని అసలైన బీపీఎల్  కుటుంబాలకు సరిపోతుంది. కానీ, గత ప్రభుత్వం అదనంగా 35.28 లక్షల కార్డులు ఇవ్వగా, ప్రస్తుత ప్రభుత్వం మరో 15.12 లక్షల కార్డులను మంజూరు చేసింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కార్డుల సంఖ్య 1.05 కోట్ల కు చేరింది.

సగటున ఒక కుటుంబంలో నలుగురు ఉన్నా 4.20 కోట్ల మందికి ఉచిత బి య్యం అందుతోంది. ఇది తెలంగాణ మొత్తం జనాభా కంటే ఎక్కువ కావడం గమనార్హం. రాష్ట్రంలోనే అత్యంత సంపన్న గ్రామంగా పేరుగాంచిన నిజామాబాద్ జిల్లాలోని అం కాపూర్ గ్రామాన్ని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఒక ఉదాహరణగా పేర్కొంది. ఆ గ్రా మంలో 300 కార్లు, 800 బైకులు, 30 ట్రాక్టర్లు ఉన్నాయి. 326 మంది విదేశాల్లో ఉద్యోగాలు చేస్తూ భారీగా నిధులు పంపిస్తున్నారు. గ్రామంలోని 1804 కుటుంబాలలో ఏకంగా 1,225 కుటుంబాలు ఉచిత బియ్యం పొందుతున్నాయి.

అర్హత ప్రమాణాల ప్రకా రం అక్కడ 300 కార్డులకు మించి ఉండకూడదని పద్మనాభరెడ్డి స్పష్టం చేశారు. బంగా రం వాసన వచ్చే గ్రామంలోనూ 70 శాతం మంది పేదలుగా చలామణి అవ్వడం దారుణం అని ఆయన ఆవేదన వ్యక్తం చేశా రు. దేశంలోనే అత్యంత సంపన్న జిల్లాగా ఉన్న రంగారెడ్డి జిల్లాలో మొత్తం 5.63 లక్షల కుటుంబాలు ఉండగా, అందులో 5.56 లక్షల కుటుంబాలకు తెల్ల రేషన్ కార్డులు ఉ న్నాయి.

అంటే జిల్లా జనాభాలో 98.7 శాతం మంది ఉచిత బియ్యం పొందుతున్నా రు. రాష్ట్ర తలసరి ఆదాయం రూ. 4.12 లక్షలుగా ఉన్నప్పుడు, కేవలం రూ. 2 లక్షల లో పు ఆదాయం ఉన్నవారే 85 శాతం మంది ఉన్నారని ప్రభుత్వం చూపడం హాస్యాస్పదమని ఫోరం విమర్శించింది.

అర్హత లేని వారి ని కార్డుల నుంచి తొలగించాలని కేంద్ర ప్ర భుత్వం పలుమార్లు సూచించినా రాష్ట్ర ప్ర భుత్వం పట్టించుకోవడం లేదని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ మండిపడింది. ప్రజా నిధులు ఇలా దుర్వినియోగం కావడం వల్ల రాష్ట్రంపై ఆర్థిక భారం పెరుగుతోందని పద్మనాభరెడ్డి లేఖలో పేర్కొన్నారు. ఇప్పటికైనా సీఎం  రేవంత్ రెడ్డి స్పందించి, తెల్ల రేషన్ కార్డులపై సమగ్ర దర్యాప్తు జరిపించి పీడీఎస్ వ్యవస్థను ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేశారు.