22-05-2025 08:31:36 PM
హుస్నాబాద్ (విజయక్రాంతి): వానకాలం పంటల సాగు సమీపిస్తున్న తరుణంలో మార్కెట్ లో నకిలీ విత్తనాల అమ్మకాలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. విత్తన మాఫియాపై కన్నేసి రైతులు నష్టపోకుండా చూస్తున్నారు. జిల్లా కలెెక్టర్, పోలీసు కమిషనర్ ఆదేశాలతో గురువారం సిద్దిపేట జిల్లా అక్కన్నపేట ఎస్సై విజయభాస్కర్(SI Vijayabhaskar), వ్యవసాయ అధికారి తస్లీమా సుల్తానా(Agriculture Officer Taslima Sultana)తో కలిసి అక్కన్నపేట మండల కేంద్రంలోని విత్తన దుకాణాలను తనిఖీ చేశారు. అవి అసలు విత్తనాలా.. నకిలీవా అని పరిశీలించారు. రిజిస్టర్లను చూసి స్టాకు వివరాలు తెలుసుకున్నారు.
ప్రభుత్వం అనుమతించిన విత్తనాలే అమ్మాలని, నకిలీ విత్తనాలు అమ్మితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులు ప్రభుత్వం నిషేధించిన బీటీ పత్తి విత్తనాలు కొనుగోలు చేయవద్దని సూచించారు. దీంతో పాటు గ్రామాలలో తిరుగుతూ అమ్మే విడి విత్తనాలు కొనుగోలు చేయవద్దని సూచించారు. విత్తనాలు కొనుగోలు చేసిన వెంటనే రషీదు పొందాలని, పంట కాలం పూర్తయ్యేదాకా రషీదుతో పాటు విత్తనాల ప్యాకెట్లు దగ్గర ఉంచుకోవాలన్నారు. నకిలీ విత్తనాలు అమ్మే షాపు యజమానులు, వ్యక్తులపై పీడీ యాక్టు ప్రకారం కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎక్కడైనా నకిలీ విత్తనాలు ఉన్నట్టు, అమ్ముతున్నట్టు తెలిసినా వెంటనే స్థానిక పోలీసులకు, డయల్ 100కు గానీ సిద్దిపేట పోలీసు కమిషనరేట్ కంట్రోల్ రూమ్ నంబర్ 8712667100 కు ఫోన్ చేసి సమాచారాన్ని ఇవ్వాలన్నారు.